
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్ మీద నమ్మకం ఉంచి ప్రజలు ఆయనకు భారీ విజయం కట్టబెట్టారని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారమిక్కడ ఆయన మాట్లాడుతూ...చంద్రబాబు అహంకారం, అవినీతే టీడీపీని ఓటమి పాలు చేసిందని విమర్శించారు. అవినీతి పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడారని హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోదీ గురించి టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. ముక్కముక్కలుగా నరుకుతామని ప్రతిపక్ష నేతను బెదిరించేవారు. కోడికత్తి పార్టీ అంటూ వైఎస్సార్ సీపీని చంద్రబాబు హేళన చేసేవారు’ అని చంద్రబాబు తీరును ఎండగట్టారు.
టీడీపీ కుట్రల వల్లే..
ఏపీలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని జీవీఎల్ విచారం వ్యక్తం చేశారు. తమ ఓటమికి టీడీపీ కుట్రపూరిత రాజకీయాలే కారణమని ఆరోపించారు. బీజేపీ వంశపారంపర్య రాజకీయాలకు దూరమని, వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్, రాహుల్, కవిత ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ అభివృద్ధిని చూసిన దేశ ప్రజలు రెండోసారి గెలిపించారని హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment