
గాంధీనగర్ : గుజరాత్ కేబినెట్ చిచ్చు తారాస్థాయికి చేరిన వేళ.. శాఖ కేటాయింపుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నితిన్‌భాయ్ పటేల్ వ్యవహారం గుజరాత్‌లో కొత్త రాజకీయానికి తెరలేపింది. పటేళ్ల ఆత్మగౌరవ సమస్య అంశం తెరపైకి రావటంతో పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ మళ్లీ మీడియా ముందుకు వచ్చేశాడు.
ఈ క్రమంలో డిప్యూటీ సీఎం నితిన్‌పటేల్‌కు హార్దిక్ బంపరాఫర్ ప్రకటించాడు. ‘‘ఆయన(నితిన్) వెంటనే బీజేపీని వీడాలి. తన వెంట మరో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావాలి. అలా వస్తే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి ఆయనకు గౌరవప్రదమైన స్థానం ఇప్పిస్తా’’ అని హామీ ఇస్తున్నాడు. బీజేపీ గౌరవించని పక్షంలో ఇంకా పార్టీని పట్టుకుని వేలాడే అవసరం నితిన్‌కు ఏంటని హార్దిక్ ప్రశ్నిస్తున్నాడు. సారంగపూర్‌లో మీడియాతో హార్దిక్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
కాగా, శాఖల కోతలు, బాధ్యతల స్వీకరణలో ఆలస్యంపై నితిన్ పటేల్ ఇప్పటిదాకా ఎలాంటి అధికార ప్రకటనచేయనప్పటికీ, ఆయన అవమాన భారంతో రగిలిపోతున్నట్లు, తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పరిస్థితి అసంతృప్తి తారాస్థాయికి చేరితే మాత్రం బీజేపీ చెయ్యి జారి గుజరాత్ రాజకీయాల్లో సమూల మార్పులు వాటిల్లే అవకాశం ఉందన్నది విశ్లేషకుల మాట.