సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలే భూస్థాపితం చేస్తారని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను ఏళ్లుగా పెండింగ్‌లో ఉంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. ప్రాజెక్టుకు కల్వకుర్తి అని పేరుపెట్టిన కాంగ్రెస్ నేతలు, కల్వకుర్తికి ఎందుకు నీరివ్వలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కల్వకుర్తికి నీరిచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. ఈ ఏడాదిలోనే అలంపూర్‌లోని 87 వేల ఎకరాలకు నీరిచ్చి రుణం తీర్చుకుంటామని చెప్పారు.
మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎడ్మ కిష్టారెడ్డి (కల్వకుర్తి), అబ్రహం (అలంపూర్) సహా పెద్ద ఎత్తున వారి అనుచరులు శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరులో జరిగిన అభివృద్ధే వీరి చేరికకు నిదర్శనమన్నారు.
ఈ నాయకుల చేరికతో ఎప్పుడు ఎన్నికలొచ్చినా మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 సీట్లు టీఆర్‌ఎస్ స్వీప్ చేస్తుందని చెప్పారు. పాలమూరు నుంచి ఎంతో మంది నేతలను ఢిల్లీకి పంపినా ఆకలి చావులు తగ్గలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏనాడైనా పట్టించుకున్నదా అని హరీశ్ ప్రశ్నించారు. రైతులు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. రైతు పక్షపాతిగా పనిచేస్తోందన్నారు. రైతుల కళ్లలో ఆనందం చూసి కాంగ్రెస్ నేతలు ఏడుస్తున్నారని, ఆ ఏడ్పులతోనే వారి కళ్లు ఎర్రబడుతున్నాయని విమర్శించారు.
వారిది ఎప్పుడూ కుర్చీల కొట్లాటే..
గట్టు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశామని.. తుమ్మిళ్ల నుంచి నీటి విడుదల, గట్టు ఎత్తిపోతలకు త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని హరీశ్ వెల్లడించారు. కాంగ్రెస్‌కు అధికారం ఉంటే ఇవన్నీ ఎక్కడ ఉండేవో ఆలోచించాలన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ఇతర ప్రాంతాల నాయకులకు హారతులు పట్టిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులది ఎప్పుడూ కుర్చీల కొట్లాటనేనని, వారెప్పుడూ ప్రజల్ని పట్టించుకోరని దుయ్యబట్టారు.
పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకం కాకుంటే ఎందుకు కోర్టులకు పోయారన్న హరీశ్.. ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరుకుంటే వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. మంత్రి ఈటల మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన మహబూబ్‌నగర్ ఇప్పుడు రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన జిల్లాగా మారుతోందన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే మహబూబ్‌నగర్‌లో పేదరికం పూర్తిగా పోయిందని చెప్పారు.
కేసీఆర్‌తో భేటీ
ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎడ్మ కిష్టారెడ్డి, అబ్రహాం తదితరులు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం రావాల్సి ఉన్నా ఆర్టీసీ సమ్మెపై చర్చల వల్ల హాజరుకాలేకపోవడంతో వారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment