
సిద్దిపేట కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు. చిత్రంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, సిద్దిపేట: ‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీని ఇచ్చారు. ఎమ్మెల్యేలను గెలిపించారు.. అదేవిధంగా ఎంపీ అభ్యర్థులను కూడా గెలిపిస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు జోడెడ్లలా పనిచేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారు’అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, ములుగు, వర్గల్ ప్రాంతాల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్తప్రభాకర్‌రెడ్డి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. కార్యకర్తల సమావేశంలో కూడా మాట్లాడాడు. సిద్దిపేట ఉద్యమంలోనేకాక అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో ఉందన్నారు.
మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేయడానికే భయపడుతున్నాయని అన్నారు. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం కలగడం వరంగా భావిస్తున్నానని అన్నారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలు ప్రజలకు నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహకారంతో వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి రైల్వే లైన్లు, జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పారు. మరోసారి తనను దీవించి గెలిపించాలనికోరారు.
త్వరలోనే పదవి..
ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన హరీశ్‌రావుకు మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగా కార్యకర్తలు నిరాశతో ఉన్నారని, అయితే త్వరలోనే మన నాయకుడికి మంచి పదవి వస్తుందని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, టీఆర్‌ఎస్ నాయకునేత రాధాకృష్ణశర్మలు అన్నారు. శనివారం సిద్దిపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. త్వరలో శుభవార్త వింటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment