సాక్షి, సిద్దిపేట: ‘ప్రస్తుత ఎన్నికల సమరానికి మహాభారత యుద్ధానికి పోలికలు ఉన్నాయి. మా పాలన మాకు కావాలనే న్యాయమైన కోరిక సాధన కోసం ఆరు దశాబ్దాలుగా పోరాడాం. త్యాగాలు, అవమానాలు.. ఇలా భారతంలో పాండవుల మాదిరిగా తెలంగాణ ప్రజలు కష్టపడ్డారు. చివరకు ధర్మం గెలిచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది. ధర్మపాలన సాగుతోంది. దీనిని చూసి ఓర్వలేక, కుర్చీమీద ఉన్న ధ్యాస ప్రజలపై లేక.. అధికారంకోసం కాంగ్రెస్ నీచానికి దిగజారింది. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్న ధృతరాష్టుడైన టీడీపీతో జతకడుతోంది. అన్యాయం చేసిన వారితో స్నేహం చేసి, మహాకూటమి కౌరవ సైన్యంలా తయారైంది’అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం సిద్దిపేట నియోజకవర్గ యాదవ సంఘం, సిద్దిపేట పట్టణంలోని రాజస్తానీయులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీడీపీకి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరడంతో వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. హరీశ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత గ్రామీణ వ్యవస్థను చక్కదిద్దేందుకు కులవృత్తులను ప్రో త్సహిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. గొల్ల, కురుమలకు సబ్సిడీ గొర్రెలు పంపిణీ చేసి గ్రామాల్లో సంపదను సృష్టించామన్నారు. ఇలా అన్ని వర్గాలకు ప్రభుత్వం చేయూత నిచ్చిందని, అందుకోసమే ప్రజలందరూ టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని చెప్పా రు. ఇది చూసి కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేకనే అన్ని పార్టీలను కూడగట్టుకుంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు కంటి పరీక్ష చేయించాలి
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూడలేని దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కంటివెలుగు కింద పరీక్షలు చేయించాలని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణలోని గొల్ల, కురుమలకు తాము అందిస్తున్న చేయూతను చూసిన కర్ణాటక మంత్రి రేవణ్ణ నేరుగా కేసీఆర్‌ను కలసి గొంగళి కప్పి సన్మానించారన్నారు. వేరే రాష్ట్రంలోని నాయకులు తెలంగాణ అభివృద్ధిని చూసి అభినందిస్తూంటే ఇక్కడి కాంగ్రెస్ నాయకులు మాత్రం కబోదుల్లా వ్యవహరించడం శోచనీయమన్నారు. తెలంగాణ ఏర్పాటును, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. చంద్రబాబును, కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు.
తెలంగాణలో టీడీపీది ఒడిచిన కథ..
తెలంగాణ ద్రోహుల పార్టీగా ముద్రపడ్డ టీడీపీకి రాష్ట్రంలో చోటు లేదని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీది ఒడిచిన కథ అని హరీశ్ విమర్శించారు. ఒక వైపు అభివృద్ధిని అడ్డుకుంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు, కేంద్రానికి ఫిర్యా దులు చేసిన చంద్రబాబు, మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణలో తిరగడం సిగ్గుమాలిన పని అన్నారు. బిహార్, జార్ఖండ్ విభజన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ బిహార్‌కే పరిమితమైందన్నారు. అదే పరిస్థితి ఇప్పుడు టీడీపీకి వచ్చిందని అన్నారు.
అన్ని రాష్ట్రాల ప్రజలను ఆదరిస్తున్నాం..
హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు వలస వచ్చిన వివిధ రాష్ట్రాల ప్రజలను ఆదరించి అక్కున చేర్చుకున్నామని హరీశ్‌రావు అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మహారాష్ట్ర, గుజరాతీ, రాజస్తాన్‌వాసులు కూడా మద్దతు తెలిపారని అన్నారు. ఎప్పుడో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి ప్రజలతో మమేకమైన వా రికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పా రు. మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అది కౌరవ కూటమి: హరీశ్
Published Sun, Oct 14 2018 1:45 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment