భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్ : ‘‘రాష్ట్ర రైతాంగానికి సాగునీరు రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారు. తన పిల్లలను తానే తినే విషపునాగుల్లా వ్యవహరిస్తున్నారు’’అంటూ భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, బి.వెంకటేశ్వర్లు, ఎ.జీవన్‌రెడ్డిలతో కలిసి మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన విలేకరులతో సుదీర్ఘంగా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు నీరివ్వడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ మాత్రం తన చేతిలో అధికారం లేకపోవడాన్ని జీర్ణించుకోలేక కుయుక్తులు పన్నుతోందన్నారు. తెలంగాణ ఏర్పాటు పట్ల ప్రదర్శించిన అలసత్వ వైఖరినే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ చూపుతోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఏం చేసినా వ్యతిరేకించడమే కాంగ్రెస్‌కు పనిగా ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టును కేసులతో నీరుగార్చడానికి విఫలయత్నం చేసిందని చెప్పారు. అయినా అన్ని ప్రయత్నాలూ విఫలమవడంతో ఎన్నికలకు ముందు రౌండ్ టేబుల్ మీటింగులతో హడావుడి చేస్తోందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైతే రాజకీయంగా పుట్టగతులుండవనే భయంతోనే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలకు తెర తీస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టులను అడ్డుకునే ద్రోహంలో ఏపీ సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తేడా లేదన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కాంగ్రెస్, జేఏసీ ఏకమయ్యాని ఆరోపించారు. ‘‘ఎవరేం చేసినా తెలంగాణ ప్రజలే టీఆర్‌ఎస్‌కు హైకమాండ్. ప్రజలే అన్నీ నిర్ణయిస్తారు’’అని ఆయన స్పష్టం చేశారు.
‘రౌండ్ టేబుల్’రాజకీయాలు!
గోదావరిపై మధ్య ఇప్పటివరకూ తరహా ప్రాజెక్టు కూడా లేదని హరీశ్ గుర్తు చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 37 ఏళ్లలో కనీసం 6 లక్షల ఎకరాలకు కూడా కాంగ్రెస్‌పార్టీ నీళ్లివ్వలేకపోయింది. దీని ఆయకట్టును 9.25 లక్షల ఎకరాలకు చేర్చడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం. కాళేశ్వరం ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయాలని టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుంటే అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు అనేక కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్, జేఏసీ ఒక్కటయ్యాయి. కోదండరాం, మరికొందరు లాయర్లు ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ కారులో వెళ్లారు! వారి కుమ్మక్కుకు ఇది నిదర్శనం కాదా? చనిపోయిన రైతుల పేర్లతో కేసులు వేసి కాంగ్రెస్ నేతలు శవ రాజకీయాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి కేసులు వేసినవారికి కాంగ్రెస్ పార్టీ నుంచే ఆర్థిక సాయం అందింది. మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకు ఖాతా నుంచి పిటిషనర్లకు డబ్బులు వెళ్లాయి. ఢిల్లీ వెళ్లడానికి వారికి విమానం టికెట్లను కూడా ఎన్నోసార్లు శ్రీనివాస్‌రెడ్డే సమకూర్చారు’’అని హరీశ్ వెల్లడించారు. సంబంధిత బ్యాంకు ఖాతాల వివరాలను మీడియాకు చూపించారు. ఇలాంటి ఎన్నో ఆధారాలు ఉన్నాయని, మిగతా వాటిని అసెంబ్లీలోనే బయటపెడ్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాళేశ్వరానికి అన్ని అనుమతులూ సాధించామని గుర్తు చేశారు. కోర్టుల్లో ఓడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రౌండ్ టేబుల్ అంటూ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
తమ్మిడిహట్టి ఎండమావి... మేడిగడ్డ ఒయాసిస్సు
తమ్మిడిహట్టి వద్ద 20 వేల క్యూసెక్కుల నీటిలభ్యత ఉందంటూ శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీశ్ చెప్పారు. కేంద్ర జలసంఘం నివేదిక ప్రకారమే అక్కడి లభ్యత 1,200 క్యూసెక్కులు మాత్రమేనన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ప్రాణహిత–చేవెళ్ల జాతీయ హోదా కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశామని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుపై మాట్లాడుతున్న కాంగ్రెస్ తాను అధికారంలో ఉండగా మహారాష్ట్రతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకోలేదని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం 2015 మార్చిలో కీలక ప్రకటన చేసినందుకే ప్రాణహిత–చేవెళ్లను చేయలేదన్నారు.
తమ్మిడిహట్టి ఎండమావి అయితే మేడిగడ్డ ఒయాసిస్ లాంటిదని హరీశ్ అన్నారు. పొరుగు రాష్ట్రాలు నాగార్జునసాగర్‌కు ఎగువన ఆల్మట్టి, శ్రీరాంసాగర్‌కు ఎగువన బాబ్లీ ప్రాజెక్టులు కట్టడంతో వాటి పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. అలాంటి పొరపాట్లు లేకుండా, వందేళ్యినా రాష్ట్ర సాగునీటి, హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడానికే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామని వివరించారు. కాంగ్రెస్ ఏడేళ్లలో చేయని పనులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండేళ్లలో చేసి చూపిందన్నారు. భూ పరిహారం ఆరింతలు పెరగడం, రిజర్వాయర్లు, లిఫ్టులు పెరగడం, ఆయకట్టు పెరగడం వల్లే కాళేశ్వరం అంచనా వ్యయం పెరిగిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సక్రమంగా లేకుంటే కేంద్ర జలసంఘం అన్ని అనుమతులూ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఏపీలో నీళ్లు లేనిచోట కండలేరు, ఓర్వకల్లు రిజర్వాయర్లు కట్టినప్పుడు మాట్లాడని కాంగ్రెస్ నేతలు మల్లన్నసాగర్ గురించి మాట్లాడటం దారుణమన్నారు. తోటపల్లి వద్ద ముంపు గ్రామాలను తగ్గిస్తే ఇబ్బందేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు అడ్డుపడ్డా కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలతో రైతుల పొలాలు తడుపుతామని స్పష్టం చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు తెస్తున్నామని, నిర్ణీత వ్యవధిలోనే నిర్ణాం పూర్తి చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment