హోదా రాకుండా చేసింది టీఆర్ఎస్సే..
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసును కేసీఆర్ నీరుగార్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు క్విడ్ ప్రో కో మాదిరిగా పరస్పరం సమర్ధించుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తుత టీఆర్ఎస్ సర్కార్ కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మల్లన్న ముంపు గ్రామాల్లో 50 రోజులుగా 144 సెక్షన్ అమలులో ఉండటం నియంతృత్వం కాదా అని ప్రశ్నించారు.
సోమవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. సాగునీటి ప్రాజెక్టుల పట్ల టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం గా ఉందని, మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు భరోసా ఇచ్చేందుకు ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయని అన్నారు. రీడిజైన్ పేరుతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చిన టీఆర్ఎస్.. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా చేసిందని దుయ్యబట్టారు. టీడీపీ, కాంగ్రెస్ ఏకమై ప్రాజెక్టులకు అడ్డుతగులుతున్నాయన్న మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలను ఖండించారు.