సోమవారం గజ్వేల్‌లో ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న హరీశ్
గజ్వేల్: ‘డిసెంబర్ 11 తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుడు ఖాయం.. ఆ పార్టీది ఇక ముగిసిన అధ్యాయం. ఇది గ్రహించి దింపుడుకల్లం ఆశతో ఆ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తుండ్రు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే నాలుక చీరేస్తా! నీకే టికెట్‌కు దిక్కులేదు.. నా గురించి మాట్లాడుతావా?’అంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి హరీశ్‌రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ టీడీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. వెన్నుపోటుదారుల పార్టీ టీడీపీ.. అని ధ్వజమెత్తారు. ‘పచ్చ కండ్లు ఉన్నోనికి.. లోకమంతా పచ్చగా కనిపిస్తదట. మీరు కూడా గట్లనే చేస్తుండ్రు. చివరి ప్రయత్నంగా గోబెల్స్ ప్రచారానికి దిగుతుండ్రు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు ఉనికి కోసం మాట్లాడుతుండ్రు. ఆంధ్రా పార్టీలో ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డిలాంటి నాయకులు నాపై, టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తే జనం నవ్వుకుంటుండ్రు’అని అన్నా రు. తమ గురించి ప్రజలకు తెలుసునని పేర్కొన్నా రు. ‘ఉద్యమం నుంచి వచ్చిన నాకు త్యాగాలు మాత్రమే తెలుసు.. మీలాగా మోసాలు చేయడం తెలియదు’ అని అన్నారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
కాంగ్రెస్‌కు ఓటమి భయం..
కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని హరీశ్‌రావు అన్నారు. కూటమికి మహా ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణ ఉద్యమంలోనూ అనేక కుట్రలు చేసిన చరిత్ర మీది.. అంటూ ధ్వజమెత్తారు. పదవులు తమకు గడ్డిపోచలతో సమా నమని స్పష్టంచేశారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీలు ప్రజల జీవితాల్లో మట్టి కొట్టాయని.. నేడు ఆ దుస్థితిని మార్చడానికి ప్రయత్సిస్తున్నామన్నారు. ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్పు త్వరలో పరిష్కారమవుతుందన్నా రు. సభలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, భూపతిరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మాజీ జెడ్పీచైర్మన్ లక్ష్మీకాంతారావు, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, ముదిరాజ్ సంఘం గజ్వేల్ నియోజకవర్గ నేత కొట్టాల యాదగిరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment