సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదిపిన బీజేపీ, దుష్వంత్ నాయకత్వంలోని ‘జన్నాయక్ జనతా పార్టీ’తో చేతులు కలిపింది. దుష్వంత్‌కు డిప్యూటి ముఖ్యమంత్రి పదవిని ఎరవేసి మద్దతు కూడకట్టింది. ఇలాంటి విషయాల్లో పావులు కదపడంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎప్పుడు ముందే ఉంటారనే విషయం తెల్సిందే. అయితే గత (2019) లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీకి బ్రహ్మరథం పట్టిన హరియాణా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ మెజారిటీని కూడా బీజేపీకి ఎందుకు అందించలేదు? అంతలోనే ఎందుకు మనసు మార్చుకున్నారు?
గత లోక్‌సభ ఎన్నికల్లో పదికి పది స్థానాలను గెలుచుకున్న బీజేపీకి 58.2 శాతం ఓట్లు వచ్చాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి ఆరు సీట్లు తక్కువగా 40 సీట్లు గెలుచుకున్న కమలం పార్టీకి 36. 2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఐదు నెలల కాలంలోనే 22 శాతం ఓట్లు తగ్గాయి ఎందుకు? ఆరెస్సెస్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రజాకర్షణలో వెనకబడ్డారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఎదురైన అసమ్మతిని సర్దుబాటు చేసుకోవడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టింది. మరోపక్క హరియాణాలో ఎక్కువ ఉన్న జాట్లు ఓటు వేయక పోవడం వల్ల పోలింగ్ శాతం తగ్గిందని భావిస్తున్నారు. ఎందుకు? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు.
హరియాణా ఓటరు తెలివి మీరాడని, లోక్‌సభ ఎన్నికల్లో ఒకలాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకలాగా వ్యవహరించే వివేచన వచ్చిందేమో! అన్నట్లుగా జాతీయ టీవీ యాంకర్లు మాట్లాడారు. సాధారణంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒక్కసారి జరిగినప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఓటు వేసిన పార్టీకే, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తారని ఇప్పటి వరకు నిర్వహించిన అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి. లోక్‌సభకు, అసెంబ్లీకి వేర్వేరుగా ఎన్నికలు జరిగినప్పుడు ఓటరు ఎప్పుడూ భిన్నంగానే ఆలోచిస్తాడని, అయితే అందుకు అనేక కారణాలు ఉంటాయని రాజకీయ పండితులు గతంలో అభిప్రాయపడ్డారు. అయితే ఈసారి హరియాణా ప్రజల స్పందనకు స్పష్టమైన కారణాలు కనిపించక పోవడం అంటే బీజేపీ పట్ల గుడ్డి అభిమానం తగ్గుతుందన్నదనడానికి సూచన అని కొంత మంది రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: దుష్యంత్ నన్ను మోసం చేశారు)
Comments
Please login to add a commentAdd a comment