సాక్షి, సిటీబ్యూరో: గత ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు.. ప్రస్తుతం జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ, రెండు రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికలు.. పోటీ ఎక్కడైనా సరే ప్రజలను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ తనకు అవసరమైన డబ్బులో అత్యధికం హైదరాబాద్ కేంద్రంగానే తరలిస్తోంది. ఆ పార్టీ నేతలు, ప్రధాన అనుచరులకు సిటీ, శివారు ప్రాంతాల్లో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. పెద్ద మొత్తాలను తరలించేందుకు హవాలా లావాదేవీలు కారణమనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న రూ.60 కోట్లు, వరంగల్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.5.8 కోట్లు, తాజాగా రాజేంద్రనగర్ పోలీసులు గుట్టురట్టు చేసిన రూ.24 లక్షల రవాణా.. ఇవన్నీ తెలుగుదేశం పార్టీతో లింకు ఉన్నవే కావడం గమనార్హం.
వ్యాపారాల ‘ముసుగు’లో తరలింపు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పరిటాల శ్రీరామ్‌కు అందించడానికని అనుమానిస్తున్న రూ.24 లక్షల నగదును సోమవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్‌లో నివసించే రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి వెంకట ప్రసాద్‌కు పటాన్‌చెరులో ఫ్యాక్టరీ ఉంది. దీంతో ఇతడు సమీకరించిన నల్లధనాన్ని తన డ్రైవర్‌కు ఇచ్చి పంపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ సంతోష్‌రెడ్డిని డబ్బుతో సహా పట్టుకున్న పోలీసులు.. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ప్రసాద్ ఒక్కరే కాదు.. టీడీపీకి చెందిన అనేక మంది కీలక నాయకులకు హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు, వ్యాపారాలు ఉంటున్నాయి. వీరంతా ఎన్నికలతో పాటు కొన్ని కీలకమైన సందర్భాల్లో తమ నేతలను ‘ఆర్థికంగా ఆదుకుంటున్నారు’. ప్రలోభాలు, లంచాలకు అవసరమైన సొమ్మును తమ వ్యాపారాల ముసుగులో తరలించి వారికి అప్పగిస్తున్నారు. కొందరు దొంగ లెక్కలు చూపిస్తూ తీసుకువెళ్తుండగా మరికొందరు ఎలాంటి లెక్కలు లేకుండా తమ అనుచరులు, నమ్మినబంట్ల ద్వారా చేరాల్సిన చోటుకు తరలిస్తున్నారు.
హవాలా రూపంలోనూ సరఫరా
సిటీ కేంద్రంగా పనిచేస్తున్న కొందరు హవాలా వ్యాపారులను టీడీపీ వాడుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడకు డబ్బు పంపాల్సి ఉన్నా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిసీ హవాలా మార్గాన్ని ఆశ్రయిస్తోంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఈ నగదు సరఫరాల్లో కీలక దళారులుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అప్పట్లో జగిత్యాలకు రూ.60 లక్షలు పంపడానికి తెలంగాణ రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్, జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్‌కుమార్ ప్రయత్నించారు. తన డ్రైవర్‌తో హవాలా వ్యాపారుల నుంచి ఈ మొత్తం తీసుకుని జనగాం పంపేలా పథకం వేశాడు. ఈ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురిని పట్టుకున్నారు. ఇలా చిక్కిన ఉదంతాలు అతి తక్కువేని, చాపకింద నీరులా ‘పచ్చనోట్ల’ ప్రవాహం జోరుగా సాగిపోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ పోలీసులకు చిక్కిన రూ.5.8 కోట్లు కూడా అప్పట్లో తెలుగుదేశం, మహా కూటమి నేతలకు అందించడానికి తీసుకువెళ్తున్నవే కావడం గమనార్హం.
పోలీసుల నిఘా ముమ్మరం
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో నగరం నుంచి భారీగా డబ్బు అక్రమ రవాణా అవుతోందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తయ్యారు. ప్రధానంగా నగర వ్యాప్తంగా ఉన్న హవాలా, హుండీ వంటి అక్రమ ద్రవ్యమార్పిడి రాకెట్లపై డేగ కన్ను వేశారు. ఈ లావాదేవీలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాలు, మార్కెట్లలో మఫ్టీ పోలీసులను మోహరించారు. రాష్ట్ర, కమిషరేట్ల నిఘా అధికారులు సైతం విస్తృత సమాచారం సేకరిస్తున్నారు. మరోపక్క నియోజకవర్గాలు, కమిషనరేట్లు, నగరాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. లాడ్జిలు, హోటళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. నగరం నుంచి బయటకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment