
15 ఏళ్లుగా అధికారంలో కొనసాగడంతో ప్రభుత్వ వ్యతిరేకత తలెత్తడం సహజమే. కానీ ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓటమికి గ్రామీణ జీవన సంక్షోభం, రైతు సమస్యలు, నక్సల్స్ సమస్య సహా పలు అంశాలు కారణమయ్యాయి. 2013లో కేవలం లక్ష ఓట్ల తేడాతో (0.7శాతం) మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి భారీగా నష్టపోయింది.
► వ్యవసాయ సంక్షోభంపై దృష్టిసారించకపోవడం రమణ్‌సింగ్ సర్కారుపై వ్యతిరేకత పెంచింది. 2013లో రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ.. 2017లో సీఎం నియోజకవర్గమైన రాజ్‌నంద్‌గావ్‌లో 50,000 మంది రైతులు ప్రదర్శన జరిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు (సెప్టెంబరులో) క్వింటాల్ వరికి రూ. 300 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రైతులకు సర్కారుపై నమ్మకం కలగలేదు. మరోవైపు, తాము అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోగా రుణాలు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వాగ్దానం చేయడం, మద్దతు ధరలకు హామీ ఇవ్వడం వంటికి రైతాంగాన్ని ప్రభావితం చేశాయి.
► రూ.36000 కోట్ల పౌర సరఫరాల కుంభకోణంలో రమణ్‌సింగ్, ఆయన భార్యకు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడం, 60 మంది మరణానికి కారణమైన రూ.5000 కోట్ల చిట్‌ఫండ్ కుంభకోణ నిందితులపై ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం (310 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి), పనామా పేపర్లలో సీఎం కుమారుడి పేరు ఉండటం, సహజ వనరుల్ని ధనికులకు కట్టబెట్టడం వంటి అంశాలు పాలక పార్టీని అపఖ్యాతి పాల్జేశాయి. కాంగ్రెస్‌కు ఇవే పెద్ద ప్రచారాస్త్రాలు అయ్యాయి.
► 2006లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేసిన వాగ్దానం పని చేసింది. ఈ చట్టాన్ని బీజేపీ నీరుగారుస్తుందనేది కాంగ్రెస్ ఆరోపణ. బీజేపీ హయాంలో అటవీ ఉత్పత్తుల కనీస మద్దతు ధర తగ్గిపోవడాన్ని కూడా కాంగ్రెస్ ప్రముఖంగా ప్రచారం చేసింది.
► రమణ్‌సింగ్ సర్కారులోని అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీన్ని అధిగమించేందుకు కొత్త ముఖాలను బరిలోకి దింపాలన్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. టికెట్ల కేటాయింపులో అధిష్టానం మాటే చెల్లుబాటయ్యింది.
► నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరగడం (రాష్ట్రంలో ఇంచుమించు 40 లక్షల మంది నిరుద్యోగులున్నది ఒక అంచనా), ఆదివాసుల భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం, సాగునీటి వనరుల గురించి బీజేపీ సర్కారు పట్టించుకోకపోవడం వంటి అంశాలు కూడా కొంతమేరకు ప్రభావితం చూపాయి. నోట్ల రద్దు పర్యవసానాలు, జీఎస్టీ అమలు కూడా పాలక పార్టీపై కొంత వ్యతిరేకతకు కారణమైనట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment