కళల కాణాచి.. లేపాక్షితో ప్రపంచ ప్రఖ్యాతి.. తరచిచూస్తే మినీ ఇండియా సాక్షాత్కారం.. వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఎంతో గుర్తింపు. నాలుగు దశాబ్దాలుగా పచ్చపార్టీ కి కంచుకోట. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన నియోజకవర్గం.. కానీ ఇప్పటికీ అభివృద్ధికి మాత్రం ఆమడదూరం. తాగేందుకు నీళ్లు లేని నియోజకవర్గం.. జబ్బుచేసినా వైద్యం అందని దైన్యం. మౌలిక సదుపాయాలు లేని పట్టణం. ఈ ఎన్నికలు మార్పునకు నాంది పలుకుతుండగా.. హిందూపురం ఓటెత్తేందుకు సిద్ధమవుతోంది.
హిందూపురం: ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపిన నియోజకవర్గం. ఆ తర్వాత ఆయన తనయుడు హరికృష్ణను.. అనంతరం ఆయన మరో కుమారుడు బాలకృష్ణను ఎమ్మెల్యేలుగా గెలిపించింది.. కానీ అభివృద్ధిలో మాత్రం అట్టడుగు స్థానంలో నిలిచింది. నాయకుల హామీలన్నీ నీటిమూటలు కాగా.. తాగేందుకు నీళ్లు లేక జనం అల్లాడిపోతున్నారు. ఇక్కడ గత 37 ఏళ్లుగా టీడీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతున్నారు. అయినా శాశ్వత నీటి సమస్యకు పరిష్కారం చూపించలేక పోతున్నారు.
ఇక్కడుంటున్న ప్రతి కుటుంబం బిందె నీటిని రూ.5 ప్రకారం నెలకు నీటికోసమే రూ.2వేల వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దశాబ్దాలుగా ఇదే దుస్థితి. ఎన్‌టీ రామారావు నుంచి నేటి బాలకృష్ణ దాకా అందరూ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానం అని చెబుతున్నా.. ప్రజల దాహార్తిని తీర్చలేకపోయారు. కేంద్రం ఇచ్చిన రూ.194 కోట్లతో గొల్లపల్లి నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేసే పనులు పూర్తికాకుండనే బాలకృష్ణ ప్రారంభోత్సవం చేసి వదిలేశారు. దీంతో జనం ఎప్పటిలానే ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు.
రూ.650 కోట్లు కేటాయించిన వైఎస్సార్
‘పురం’ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వైఎస్సార్ తనవంతుగా కృషి చేశారు. పీఏబీఆర్ నుంచి పైపులైన్ల ద్వారా నీటిని హిందూపురానికి తీసుకొచ్చే శ్రీరామరెడ్డి నీటి పథకం కోసం ఏకంగా రూ.650కోట్ల వ్యయం చేసి 14 వందల కిలోమీటర్ల మేరకు పైపులైన్లు వేయించారు. 2008 డిసెంబరు 30న రాజశేఖర్‌రెడ్డి సీఎం హోదాలో శ్రీరామరెడ్డి నీటి పథకాన్ని ప్రారంభించారు. వైఎస్ చలువ వల్లే పట్టణ ప్రజల దాహార్తి తీరడమే కాకుండా పక్కనున్న పరిగి మండలంతోపాటు హిందూపురం నియోజకవర్గం పరిధిలో మొత్తం 220 గ్రామాలకూ తాగునీరు అందుతోంది. అయితే వైఎస్సార్ మరణానంతరం నాయకుల స్వార్థంతో శ్రీరామరెడ్డి పథకం నిర్వీర్యమైంది. తాగునీటి సమస్యలు షరామామూలయ్యాయి.
వెంచర్లుగా మారిన పారిశ్రామిక హబ్‌లు
సీఎం చంద్రబాబు...స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ ఐదేళ్లలో పారిశ్రామికాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం శంకుస్థాపనలు..భూమిపూజలతో హడావుడి చేశారు. ఈ క్రమంలోనే చిలమత్తూరు సమీపంలోని కొడికొండ చెక్‌పోస్టుకు సమీపంలో 66 ఎకరాల్లో రాగమయూరి ఎలక్ట్రానిక్ ఇండ్రస్టీస్ పార్కు, లేపాక్షి బయోటెక్నాలజీ ఇండస్ట్రీలకు 2016 ఏప్రిల్ 21న ముఖ్యమంత్రి చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఎలక్ట్రానిక్ పార్కుతో పదివేలమంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కానీ ఆ శిలాఫలకాలు కూడా నామరూపాలులేకుండా పోయాయి. ఇప్పుడా భూమిలో లేవుట్ వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇక హిందూపురం–చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్‌గా మారబోతోందని పలుమార్లు బాలకృష్ణ గొప్పలు చెప్పారు. కానీ అదీ కార్యరూపం దాల్చకపోవడంతో స్థానిక నిరుద్యోగులు ఉపాధి కోసం బెంగళూరు, కేరళ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
పేరు ఘనం.. వైద్యం మృగ్యం
పేరుకు హిందూపురంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నా...వైద్యం సేవలు మాత్రం మృగ్యంగా మారాయి. చూసేందుస పెద్దపెద్ద భవనాలున్నా...వైద్యసేవలందికే వారు కరువయ్యారు. కనీసం ప్రసవాలు కూడా చేసేందుకు సిబ్బంది లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రూ. 24 కోట్లతో నిర్మించిన మాతశిశు కేంద్రం అలంకార ప్రాయంగా మారగా...సకాలంలో వైద్యసేవలందక మాతాశిశు మరణాలు పెరిగిపోయాయి.
హిందూపురం ఆస్పత్రిలో 2017 జనవరి నుంచి 2019 మార్చి వరకు 8 మంది బాలింతలు చనిపోగా... 167 శిశు మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక గర్భంలోనే 92 మంది బిడ్డలు చనిపోయారు. బిడ్డలు కోల్పోయిన బాధితులు ఆస్పత్రి ఎదుట ధర్నాలు చేసిన సంఘటలు ఎన్నో ఉన్నాయి. అయినా ఏనాడూ ఎమ్మెల్యే వీటిపై కనీసం ఆరా తీసిన సందర్భాలు కూడా లేవు.
రైతులకు అందని గిట్టుబాటు ధర
హిందూపురం చింతమార్కెట్ యార్డు, పట్టుగూళ్ల మార్కెట్ నుంచి దేశ, విదేశాలకు సరుకు రవాణా అవుతోంది. అయితే ఇక్కడ దళారీ వ్యవస్థ అధికమై రైతులకు అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పట్టుగూళ్ల మార్కెట్ ఉన్నా... రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. దీంతో రైతులు ఎన్నోసార్లు ఆందోళనకు దిగినా...స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఏనాడూ నోరుమెదపలేదు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ కూడా సుమారు రూ.4 కోట్లు బకాయి ఉంది.
విద్యాభివృద్ధికి చేయూత కరువు
నియోజకవర్గంలో విద్యాభివృద్ధి చేయూత కరువైంది. జూనియర్ కళాశాల, డిగ్రీ, ఉర్దుకళాశాలలు లేవు. దీంతో విద్యార్థులు ప్రయివేట్ కళాశాలల్లో చదువుకునే స్థోమత లేక మధ్యలోనే ఆపివేస్తున్నారు. విద్యార్థుల వసతి గృహాలు కూడా దుర్భరంగా ఉన్నా ఈ ఐదేళ్లలో బాలకృష్ణ ఏనాడూ వీటి గురించి పట్టించుకోలేదు.
అభివృద్ధికి నోచుకోని పర్యాటక కేంద్రాలు
హిందూపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన బాలకృష్ణ...ఈమేరకు చర్యలు తీసుకోవడం లేదు. లేపాక్షి ఉత్సవాలకు మాత్రం సినీ నటులతో నాలుగు రోజులు హడావుడి చేసి హైదరాబాద్‌కు మకాం మార్చేస్తున్నరు. దీంతో లేపాక్షి క్షేత్రం అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. ఇక వీరాపురం సైబేరియన్ పక్షుల విడిది కేంద్రం పరిస్థితి మరి అధ్వాన్నంగా మారింది. కనీసం పక్షులకు సరైన నీటివసతి కూడా కల్పించలేకపోయారు. పక్షులకు సరైన ఆహారం దొరక్క ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.
ఏళ్లుగా కన్నీళ్లే..
నీటి కోసం ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. వేసవిలో పరిస్థితి దారుణంగా ఉంటోంది. అయినా ఎవరికీ మా బాధలు పట్టడం లేదు. కొన్నేళ్లుగా టీడీపీ వాళ్లనే గెలిపిస్తున్నాం. అందరూ మాటలు చెప్పే వారే కానీ కాసిన్ని నీళ్లిచ్చే వాళ్లు కరువయ్యారు. – లక్షమ్మ, వెంకటాపురం
Comments
Please login to add a commentAdd a comment