తాజా లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు ఊహించని రాజకీయ సునామీ సృష్టించారు. దశాబ్దాల అనుభవమున్న హేమాహేమీలైన నేతలు, మాజీ ముఖ్యమంత్రులతోపాటు, ఒక మాజీ ప్రధాని సైతం ఈ సునామీలో కొట్టుకుపోయారు. ఈ రాజకీయ విలయం ధాటికి 12 మంది మాజీ ముఖ్యమంత్రులు మట్టికరిచారు. వీరిలో ఎనిమిది మంది కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖులే కావడం గమనార్హం..!
ఒక ప్రధాని అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుని వరుసగా రెండోసారి మళ్లీ అధికారం చేపట్టడం దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే సంభవించింది. ఒకటి ఇందిరాగాంధీ హయాంలోదైతే.. రెండోది తాజాగా నరేంద్ర మోదీ హయాం! అదే సమయంలో ఒక ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో మాజీ ముఖ్యమంత్రులు ఓడిపోవడం కూడా ఇదే ప్రథమం. దేశ రాజధాని ఢిల్లీని ఒకప్పుడు ఏలిన షీలాదీక్షిత్ ఢిల్లీ(ఈశాన్య) లోక్‌సభ స్థానం నుంచి ఏకంగా 3.16 లక్షల ఓట్ల తేడాతో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక మాజీ ప్రధాని, కర్ణాటక ముఖ్యమంత్రి కూడా అయిన హెచ్.డి.దేవెగౌడ తుముకూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి చేతిలో కేవలం 13 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ఒక్కళిగలు, లింగాయత్‌ల మధ్య సమరంగా పరిగణించిన తుముకూరు ఎన్నికల్లో 87 ఏళ్ల దేవెగౌడ పోటీ చేయడంపై తొలి నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా మాండ్య, హాసన్‌ల నుంచి పోటీ చేసే గౌడ కుటుంబం ఈసారి తుముకూరుకు రావడం స్థానికులకు పెద్దగా రుచించలేదు. సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం జేడీఎస్‌కు కేటాయించడంపై కాంగ్రెస్‌లోనూ వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కాంగ్రెస్ నేత ముద్దె హనుమేగౌడ నుంచి సహకారం అంతంతమాత్రమే అయింది. దీంతో దేవెగౌడ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.
దిగ్విజయ్ పరాజయం...
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్ వివాదాస్పద బీజేపీ నేత, మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. రాజ్‌గర్ నుంచి బరిలోకి దిగాలని ప్రజ్ఞా సింగ్ ఆలోచించినా.. చివరకు పార్టీ నిర్ణయం ప్రకారం భోపాల్ బరిలోకి దిగి ఏకంగా 8.6 లక్షల ఓట్లు సాధించగా.. దిగ్విజయ్‌కు మాత్రం ఐదు లక్షల ఓట్లే పడ్డాయి.
మహారాష్ట్రలో ఇద్దరికి ఓటమి...
మహారాష్ట్ర ఎన్నికల్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు లోక్‌సభ బరిలో చతికిలపడ్డారు. నాందేడ్‌లో అశోక్ చవాన్ బీజేపీ అభ్యర్థి ప్రతాప్ రావు చికాలికర్ చేతిలో 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే సీనియర్ కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే షోలాపూర్ స్థానంలో లక్షకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి బరిలోకి దిగడంతో సంప్రదాయ ఓటర్లు చీలిపోయి అది కాస్తా బీజేపీ అభ్యర్థి సిద్దేశ్వర్ శివాచార్యకు ఉపకరించిందని అంచనా. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మునిమనుమడు ప్రకాశ్ అంబేడ్కర్‌కు 5.24 లక్షల ఓట్లు దక్కాయి. ఉత్తరాఖండ్, మేఘాలయాల మాజీ ముఖ్యమంత్రులు హరీశ్ రావత్, ముకుల్ సంగ్మాలతోపాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ చిక్కబళాపురం నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు. భూపీందర్ హుడా (హరియాణా), మెహబూబా ముఫ్తీ (జమ్మూకశ్మీర్), బాబూలాల్ మరాండి (జార్ఖండ్), శిబూ సోరెన్ (జార్ఖండ్)లు కూడా ఓటమిపాలైన మాజీ సీఎంల జాబితాలో ఉన్నారు.
మట్టికరిచిన మాజీ సీఎంలు
Published Sat, May 25 2019 2:44 AM | Last Updated on Sat, May 25 2019 3:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment