శిక్షణ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ మాణిక్‌రాజ్
సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ ఆఫీసర్స్‌కు శిక్షణ ఇస్తున్న కేంద్రాలలో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్ కన్నన్ ఆదివారం పర్యటించారు. శిక్షణలో భాగంగా 12/12అ ఫాంల జారీ, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బంది వినియోగించుకోనున్న పోస్టల్ బ్యాలెట్‌పై శిక్షణలో వివరించారు. డీఆర్‌సీ కేంద్రాల పోలింగ్ సిబ్బందికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్ల పంపిణీ, వాటిని తిరిగి స్వీకరించడం, స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటు... భద్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈడీఆర్‌సీ కేంద్రాలలో సీసీ కెమెరాలు, ఇతర సౌకర్యాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నెల 26లోగా స్ట్రాంగ్ రూమ్‌లు సిద్ధం కావాలన్నారు. వాటికి అవసరమైన మరమ్మతులను సత్వరమే పూర్తిచేయాలన్నారు. అనంతరం కలెక్టర్ మాణిక్ రాజ్ కన్నన్ ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ అఫ్ ఇంజినీర్స్, బంజరాహిల్స్‌లోని ముఫకంజా కాలేజీ అఫ్ ఇంజినీరింగ్, సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్, నారాయణగూడలోని రెడ్డి కాలేజీ ఆడిటోరియం హాల్‌లో ఉన్న కేంద్రాలను పరిశీలించారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ జి.రవి కోఠి ఉమెన్స్ కాలేజీ, వనిత మహిళా విద్యాలయ, జి.పుల్లారెడ్డి కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్‌లలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో పర్యటించారు. ఎన్నికల సిబ్బందికి ఎన్నికల ప్రక్రియపై అవగహన కల్పించారు.
పోలింగ్ శాతం పెరిగేలా చూడాలి
అంబర్‌పేట్: పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ శాతం పెంచేందుకు ఆయా డీఆర్‌సీ కేంద్రాల ఇన్‌చార్జ్‌లే బాధ్యత తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ సూచించారు. ఎన్నికల విధుల కోసం డీఆర్‌సీ కేంద్రాల్లో శిక్షణ కోసం వస్తున్న ఉద్యోగుల వివరాలు, వారి ఓటర్ కార్డును తీసుకొని ఓటు వేసేలా చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆదివారం బర్కత్‌పుర రెడ్డి మహిళా కళాశాలలో ఉన్న అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన డీఆర్‌సీ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వచ్చిన ఉద్యోగుల ఓటరు కార్డులు ఉన్నాయా.. ఏ నియోజకవర్గంలో.. ఏ పోలింగ్ కేంద్రంలో వారికి ఓటు ఉంది అనే వివరా లు నమోదు చేసుకుంటున్నారా.. అని డీఆర్‌సీ ఇన్‌చార్జ్‌లను అడిగారు. వారి వివరాలను ఎందుకు నమోదు చేయలేదని ఈఆర్‌వో కృష్ణయ్య, ఏఆర్‌వో జ్యోతిలను ప్రశ్నించారు. శిక్షణకు వచ్చే ప్రతి ఒక్కరి ఓటు వివరాలు నమోదు చేసి వారు ఓటు వేసేలా బాధ్యత తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment