
బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్(పాత చిత్రం)
హైదరాబాద్: గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా దానికి హైదరాబాద్‌తో లింకులుండటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని వ్యాఖ్యానించారు. వేల సంఖ్యలో విదేశాలకు చెందిన వాళ్లు హైదరాబాద్‌లో ఉంటున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. మతోన్మాత మజ్లీస్ పార్టీ ఉగ్రవాదులకు అండగా ఉండటమే దీనికంతటికీ కారణమని పేర్కొన్నారు. రోహింగ్యాలకు, అక్రమచొరబాటుదారులకు మజ్లిస్ మద్ధతినిస్తున్నదని ఆరోపణలు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా అక్రమంగా ఉన్న చొరబాటుదారులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అధికారుల వద్ద సమాచారం ఉన్నా ప్రభుత్వ తీరుతో మెతకగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో కూడా ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అక్రమ చొరబాటు దారుల లిస్టును ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. చారిత్రక ఓబీసీ కమిషన్‌కు బీజేపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే బీసీల్లో వర్గీకరణ చేపడుతున్నామని వెల్లడించారు. ఈ నెల 23న గద్వాల్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని, సెప్టెంబర్‌లో రెండో దశ బస్సు యాత్ర ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment