-హిమాలయ పరివార్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యప్రకాష్ సింగ్
కాచిగూడ
హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు అడ్డాగా మారిందని హిమాలయ పరివార్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఎ.సూర్యప్రకాష్ సింగ్ ఆరోపించారు. గురువారం బర్కత్‌పురలోని ఆ సంస్థ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఐఎస్‌ఐ, లష్కర్ ఏ తొయిబా, డిజేఎస్, తదితర ఉగ్రవాదులు అడ్డాగా మార్చుకుని హైదరాబాద్ నుంచే జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడేవారని.. ప్రస్తుతం వారితో పాటు ఐఎస్‌ఐఎస్ లాంటి భయానక ఉగ్రవాద సంస్థ కూడా కార్యకలాపాలు విస్తృతం చేయడం దారుణమన్నారు.
గతంలోని పాలకులతో పాటు ప్రస్తుత సీఎం కేసీఆర్ కూడా ఓ వర్గం ప్రజలకు వత్తాసు పలకడం, వారికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చుడంలోనే ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారని విమర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం యొక్క ప్రఖ్యాతి ప్రపంచ దేశాలకు తెలిసేలా బోనాల పండుగ నిర్వహిస్తుంటే.. హిందువులను టార్గెట్ చేసుకుని విధ్వంసం సృష్టించేందుకే ఉగ్రవాదులు బాంబు దాడులు, తుపాకీ దాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రచించారని ఆరోపించారు.
హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు ఓ వర్గం వారు ప్రత్యేక శిక్షణ పొందుతుంటే.. రాష్ట్రంలోని నిఘా సంస్థ నిద్దుర పోతుందా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర నిఘా సంస్థ వచ్చి నగరంలో దాడులు చేసి ఉగ్రవాదులను పట్టుకుంటే.. తెలంగాణ పోలీసులు, నిఘా సంస్థలు ఇన్నోవా కార్లు, ఏసీ గదుల్లో కునుకు తీస్తున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హిమాలయ పరివార్ సంస్థ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పగుడాకుల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.