సాక్షి,సిటీబ్యూరో: జాతీయ స్థాయిలో గడిచిన పది రోజుల వ్యవధిలో పట్టుబడిన ముగ్గురు ఉగ్రవాదులకు నగరంతో లింకులు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు గత నెల 24న కోల్‌కతాలో అరెస్టు చేసిన ఇద్దరు బంగ్లాదేశీయులు నగర శివార్లలో కొన్ని రోజుల పాటు షెల్టర్ తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. గత మంగళవా రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన లష్కరేతొయిబా ఉగ్రవాది షేక్ అబ్దుల్ నయీం నార్త్‌జోన్‌లోని మహంకాళి ఠాణాలో ‘ఎస్సేప్ కేసు’లో నిందితుడిగా ఉన్నాడు.
కోల్‌కతాలో చిక్కిన ఏబీటీ ఉగ్రవాదులు..
బంగ్లాదేశ్‌కు చెందిన నిషిద్ధ ఉగ్రవాద సంస్థ అల్సారుల్లా బంగ్లా టీమ్‌కు (ఏబీటీ) చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఎస్టీఎఫ్ పోలీసులు గత నెల 24న కోల్‌కతా రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. ఏబీటీ ఆధీనంలో పని చేస్తూ బంగ్లాదేశ్ ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న షంషద్ మియా అలియాస్ తన్వీర్, షుపూన్ బిస్వాల్ అలియాస్ తమిన్‌లు అక్టోబర్ 1న అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించి హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటికే నగర శివార్లలో నివసిస్తున్న బంగ్లాదేశీ రియాజుల్ ఇస్లాంను కలిశారు. ఓ మటన్ షాపులో పని చేస్తున్న రియాజ్ వీరికి కొన్నాళ్ళ పాటు ఆశ్రయం కల్పించాడు. అంతే కాకుండా వారితో కలిసి దేశంలోని అనేక రాష్ట్రాల్లో సంచరించాడు. తన్వీర్‌కు బోగస్ ఆధార్ కార్డు ఇప్పించడంలోనూ సహకరించాడు. చివరకు బంగ్లాదేశ్‌కు పారిపోవాలని ప్రయత్నించిన వీరిద్దరితో కలిసి కోల్‌కతా చేరుకున్నాడు. ఫుపూన్ బిస్వాస్ గత నెల రెండో వారంలో చాకచక్యంగా సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు. ఆ ప్రయత్నాల్లో ఉన్న రియాజ్, తన్వీర్ హౌరా ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేసినట్లు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ అధికారులు వీరిని అక్కడి రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. వీరి నుంచి కొన్ని కీలక పత్రాలు సైతం లభించాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర నిఘా వర్గాలు ఓ ప్రత్యేక బృందాన్ని కోల్‌కతా పంపి నగరంలో ఈ ముగ్గురి కార్యకలాపాలపై ఆరా తీశాయి. ఈ నేపథ్యంలో వీరు సిటీ శివార్లలో కేవలం ఆశ్రయం పొందారని, ఎలాంటి విద్రోహక చర్యలకూ పథక రచన చేయలేదని వెల్లడైంది.
లక్నోలో ఎల్‌ఈటీ ఉగ్రవాది అరెస్టు
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబాకు (ఎల్‌ఈటీ) చెందిన ఉగ్రవాది షేక్ అబ్దుల్ నయీం అలియాస్ నయ్యూను ఎన్‌ఐఏ అధికారులు గత మంగళవారం లక్నోలోని చార్‌భాగ్ బస్టాండ్‌లో అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఇతడిని 2007 మార్చిలో బంగ్లాదేశ్ సరిహద్దులు దాటుతుండగా బీఎస్‌ఎఫ్ అధికారులు వెస్ట్ బెంగాల్‌లో పట్టుకున్నారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు నయ్యూ మరో అయిదుగురితో కలిసి ఆపరేషన్ ‘మాద్రా’ కోసం వస్తున్నట్లు గుర్తించారు. ఈ కోడ్‌వర్డ్ ఇప్పటికీ డీ–కోడ్ కాలేదు. అదే ఏడాది మేలో నగరంలోని మక్కా మసీదులో పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఈ కేసులోనూ అనుమానితుడిగా మారడంతో రాష్ట్ర పోలీసులు ముంబై నుంచి ఇక్కడకు తీసుకువచ్చారు. పోలీసు కస్టడీలో ఉండగా 2007 జూన్ 18న మహంకాళి పోలీసుస్టేషన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో అతడిపై కేసు నమోదైంది. ఇతని కోల్‌కతా పోలీసులు 2014 సెప్టెంబర్ 24న ముంబై కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి తిరిగి హౌరా–ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కతాను తరలిస్తుండగా... ఖర్సియా–శక్తి రైల్వేస్టేషన్ల మ«ధ్య తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నయ్యూను ఎన్‌ఐఏ అధికారులు గత మంగళవారం లక్నోలో పట్టుకున్నారు. ఇతడిపై కోల్‌కతా, ముంబై, సిటీతో పాటు మరో ఐదు ప్రాంతాల్లోనూ ఉగ్రవాద సంబంధ కేసులు నమోదై ఉన్నాయి.
Published Sat, Dec 2 2017 12:20 PM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment