
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎం పీఠం కోసం ఏర్పడిన ప్రతిష్టంభనకు అసలైన పరిష్కారం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి సుధీర్ మృదుగంటివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 7లోపు ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీలూ ముందుకు రాకపోతే రాష్ట్రపతి పాలన ఒక్కటే మార్గమని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుందని, ఆ లోపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. బీజేపీ -శివసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ప్రజలు ఏ పార్టీకీ తగిన మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే శివసేన-బీజేపీ కలిసి పనిచేయడమే మేలని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ఏర్పాటులో శివసేన నేతలు కఠినంగా వ్యవహరిస్తున్నారని, మరో రెండు రోజుల్లో సేన నాయకులతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు సుధీర్ వెల్లడించారు. కాగా ఐదేళ్లపాటు తానే మహారాష్ట్ర సీఎంగా ఉంటానని బీజేపీ శాసనసభా పక్షనేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేయగా.. బీజేపీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల సత్తా తమకు ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బదులిచ్చారు. కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment