
ఇంద్రకరణ్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎన్నో మలుపులతో కూడుకుని ఉంది. ఆయన గెలుపోటములు సమానంగా స్వీకరించారు. పార్టీలూ మారారు. నిర్మల్ నియోజకవర్గంలో ప్రత్యేకత సాధించారు. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించిన నియోజకవర్గంగా నిర్మల్ గుర్తింపు పొందింది. 2016 అక్టోబర్ 11న జరిగిన జిల్లాల పునర్విభజనతో నిర్మల్ కొత్త జిల్లాగా ఆవిర్భవించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి అప్పటి వరకు పెద్దగా డిమాండ్ లేని నిర్మల్‌ను జిల్లాగా రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పశ్చిమ జిల్లా ప్రజల చిరకాల కోరిక ఆర్మూర్– నిర్మల్– ఆదిలాబాద్ రైల్వేలైన్ కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి తన వంతు ప్రయత్నాలు చేశారు. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు 27, 28వ ప్యాకేజీల ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టుకు ఐకే రెడ్డి హయాంలోనే ప్రణాళిక రూపొందింది.
2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్‌పీ తరుపున తన సత్తా చాటిన ఇంద్రకరణ్ రెడి తెలంగాణ రాష్ట్రంలో 2014 శాసనసభ ఎన్నికల్లోనూ బీఎస్‌పీ అభ్యర్థిగా విజయం సాధించి...అనంతర పరిణామాల్లో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి పదవి పొందారు. ప్రస్తుతం నిర్మల్ నుంచి టీఆర్‌ఎస్ తరుపున పోటీ చేస్తున్న ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డితో పోటీ పడుతున్నారు. 2009లో మహేశ్వర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలైన ఇంద్రకరణ్‌రెడ్డి ఈసారీ ఆయనతోనే పోటీపడుతున్నారు. అయితే 2014లో బీఎస్‌పీ తరపున పోటీ చేసి...కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న మహేశ్వర్‌రెడ్డిని మూడో స్థానంలోకి నెట్టడం గమనించదగ్గ అంశమే. ఇక గ్రామాల్లో తనపట్ల ఉన్న అభిమానం, కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి , సంక్షేమ పథకాలు తనను మరోసారి విజయతీరాలకు చేరుస్తాయని భావిస్తున్నారు. మరోవైపు నిర్మల్ టీఆర్‌ఎస్ సీటు ఆశించిన శ్రీహరిరావు ఇంటికి వెళ్లి తనతో కలిసి నడవాలని ఆహ్వానించారు. పెద్దాయన ఇచ్చిన ఆహ్వానంతో శ్రీహరిరావు కూడా ఈ ఎన్నికల్లో ఐకే రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. విజయం కోసం శ్రమిస్తున్నారు.
సిట్టింగ్ ప్రొఫైల్
అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి తొలుత టీడీపీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేశారు. 1987లో ఆదిలాబాద్ జెడ్‌పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కేంద్రంలో పి.వి. నరసింహారావు 1992లో ఎదుర్కొన్న అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్‌లో చేరారు. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడినా... 1999 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నిర్మల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తరువాత 2004లో మరోసారి విజయం సాధించారు. 2008లో టీఆర్‌ఎస్ ఎంపీల రాజీనామాల నేపథ్యంలో ఆదిలాబాద్ లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్‌పీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 2014లో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీహరిరావుపై 8,497 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం కేసీఆర్ ఆయనను టీఆర్‌ఎస్‌లోకి
ఆహ్వానించి దేవాదాయ శాఖ మంత్రిగా నియమించారు.
ప్రధాన సమస్యలు
- పత్తికి గిట్టుబాటు ధర
- నిర్మల్ చేతి వృత్తులకు తగ్గిన ఆదరణ
- పర్యాటకరంగం అభివృద్ధిపై చిన్నచూపు
- నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కొరవడడం
- చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉన్న అవకాశాలను వినియోగించుకోకపోవడం
ప్రత్యేకతలు
- జిల్లాలో రూ. 83.60 కోట్లతో 421 ఆలయాల నిర్మాణం
- రూ. 1160 కోట్లు వెచ్చించి 400/220 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం
- రహదారుల అభివృద్ధికి రూ. 354 కోట్లు
- రూ. 211 కోట్లతో మిషన్ భగీరథ
- డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ప్రగతి