
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని బయటపెడతామని ఆ పార్టీ నేత తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఈనెల 17న సంగారెడ్డిలో 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తానని, గణేశ్, దుర్గామాతల పూజలు అనంతరం రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. తనతో పాటు మద్దతుగా భార్య నిర్మల కూడా నామినేషన్ వేస్తారన్నారు. రథయాత్రలో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లోకి చేరికలుంటాయని వెల్లడించారు. తన కూతురు జయారెడ్డిని చూస్తే చాలా సంతోషంగా ఉందని, ఈ నెల 15లోగా 120 గ్రామాలు తిరిగి తన తరఫున ప్రచారం చేస్తానని ఆమె చెప్పిందని తెలిపారు.
నిరుద్యోగులకు ప్రత్యేక బోర్డు..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రత్యేకబోర్డు ద్వారా నియామకాలు చేపట్టేందుకు కృషి చేస్తామని జగ్గారెడ్డి చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లా తాగు, సాగునీటి అవసరాల కోసం సింగూరు, మంజీరా నదీజలాలందేలా కృషి చేస్తామన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 40 వేల మందికి ఇళ్ల స్థలాలిప్పిస్తామన్నారు. 5 వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను సంగారెడ్డిలో ఏర్పాటు చేయిస్తామని జగ్గారెడ్డి హామీనిచ్చారు.