మీడియాతో జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు | Mla jagga reddy comments on kcr family | Sakshi
Sakshi News home page

రాజకీయ పునరుజ్జీవం కల్పించింది కేసీఆరే.. 

Published Tue, Feb 5 2019 12:41 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Mla jagga reddy comments on kcr family - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:. ‘ఓ రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాకు రాజకీయ పునరుజ్జీవం కల్పించా రు. ఆయన పార్టీ పెట్టడం వల్లే నేను ఎమ్మెల్యేను కాగలి గాను. కేసీఆర్‌ వల్ల నాకు రెండు రకాల మేలు జరిగింది’ అని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు జగ్గారెడ్డి చెప్పారు. బీజేపీలో రాజకీయంగా తనను అణచివేసిన సమయంలోనూ టీఆర్‌ఎస్‌ అధినేత పిలిచి పార్టీలోకి ఆహ్వానించారన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ హరీశ్‌రావు బ్లాక్‌మెయిల్‌ రాజకీయాల కారణంగానే తనను జైల్లో పెట్టించారని ఆరోపించారు. ఈ కారణంగానే తన వారసురాలు జయారెడ్డి తెరపైకి వచ్చారని, జయారెడ్డిని భవిష్యత్తులో కాంగ్రెస్‌ నాయకురాలిగా చూడవచ్చని వ్యాఖ్యానించా రు. కేసీఆర్‌ కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని రాజకీయం గా విమర్శించానే తప్ప వ్యక్తిగతంగా తానెప్పుడూ మాట్లాడలేదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. తాను విభేదించేదంతా హరీశ్‌రావుతోనేనని, తనను జైల్లో పెట్టించింది ఆయనేనని ఆరోపించారు. ఉనికి కోసం హరీశ్‌ తనను బలి చేసే యత్నం చేశారని దుయ్యబట్టారు. హరీశ్‌ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను వీడతారని తాను అనుకోవడం లేదన్నారు.

హరీశ్‌తో పోలిస్తే కేటీఆర్‌ చాలా ఫెయిర్‌ అని వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్‌ పార్టీ మారేది లేదని, అయితే నియోజకవర్గ అభివృద్ధి, సం గారెడ్డిలో మెడికల్‌ కళాశాల కోసం కేసీఆర్, కేటీఆర్‌లను కచ్చితంగా కలుస్తానని చెప్పారు. తాను టీఆర్‌ఎస్‌ను వీడినప్పటి నుంచి కేసీఆర్‌తో లోపాయికారీగా కలిసింది ఎప్పు డూ లేదని, కేసీఆర్, కేటీఆర్‌లతో తాను మాట్లాడలేదని చెప్పారు. తాను జైల్లో ఉన్నప్పుడు సీనియర్‌ నేతలు ఉత్తమ్, వీహెచ్‌ తప్ప కాంగ్రెస్‌లో ఉన్న ఏ నాయకుడూ పట్టించుకోలేదన్నారు. ఆపద వస్తే ఆదుకుంటారనే విశ్వాసం కాంగ్రెస్‌లో లేదన్నారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారని, వారికి అధిష్టానం భరోసా ఇవ్వకపోతే కోలుకోవడం కష్టమేనన్నారు. కాంగ్రెస్‌లో కమిటీలు, పదవుల విషయంలో రాహుల్‌ తీసుకునే నిర్ణయాలన్నింటికీ కట్టుబడి ఉంటానన్న జగ్గారెడ్డి... ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేస్తే తప్ప కాంగ్రెస్‌లో పదవులు దక్కే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 7–8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేశారు. డీకే అరుణ, జానారెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి, విజయశాంతి, ఉత్తమ్‌ లాంటి నేతలను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని అభిప్రాయపడ్డారు.

జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వర్గాల ఫైర్‌...
టీఆర్‌ఎస్‌ గురించి, కేసీఆర్‌ గురించి జగ్గారెడ్డి సానుకూలంగా మాట్లాడటంపై కాంగ్రెస్‌ వర్గాలు మండిపడుతున్నాయి. పార్టీ మారబోనంటూనే జగ్గారెడ్డి కేసీఆర్‌ను పొగడటం, కేటీఆర్‌ చాలా ఫెయిర్‌ అని వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్‌ కేడర్‌కు ఎలాంటి సంకేతాలివ్వాలనుకుంటున్నారని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌ అంటే అభిమానం అంటూనే ‘ఢిల్లీ లాబీయింగ్‌’అని పేర్కొనడం ఏమిటని, ఢిల్లీలో నిర్ణయాలు జరిగే పరిస్థితి కాంగ్రెస్‌లో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదని గుర్తుచేస్తున్నారు. ‘జగ్గారెడ్డి వ్యక్తిగత ఎజెండాతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడాలి. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యాన్ని, పార్టీ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తే మంచిది’అని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement