‘ఓటమిని అంగీకరించినందుకు ధన్యవాదాలు’ | TPCC Chief Uttam Kumar Reddy Writes Letter To KCR | Sakshi
Sakshi News home page

హరీశ్‌ లేఖకు కౌంటర్‌గా కేసీఆర్‌కు ఉత్తమ్‌ బహిరంగ లేఖ

Published Wed, Oct 10 2018 8:07 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

TPCC Chief Uttam Kumar Reddy Writes Letter To KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని మంత్రి హరీశ్‌రావు లేఖతో తేలిపోయిందని, కాంగ్రెస్‌ గెలుపు, టీఆర్‌ఎస్‌ ఓటమిని అంగీకరించినందుకు ధన్యవాదాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉండి ప్రతిపక్షాల ఐక్యతను చూసి భయపడుతున్నారంటేనే ఓటమిని అంగీకరించినట్లని ఎద్దేవా చేశారు. మహాకూటమి పొత్తు గురించి హరీశ్‌రావు ఉత్తమ్‌కు రాసిన లేఖకు కౌంటర్‌గా బుధవారం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్‌ బహిరంగ లేఖ రాశారు. హరీశ్‌ ఆ లేఖలో అడిగిన 12 ప్రశ్నల్లో ఒక్కటీ తెలంగాణ ప్రజలకు పనికొచ్చేది లేదని, టీఆర్‌ఎస్‌ చేతకానితనానికి ఆ ప్రశ్నలు పరాకాష్ట అని తేల్చేశారు. టీడీపీతో గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు, తెలంగాణ వ్యతిరేక పార్టీలయిన సీపీఎం, ఎంఐఎంలతో పొత్తు పెట్టుకున్నప్పుడు శరం గుర్తుకు రాలేదా అంటూ హరీశ్‌ లేఖకు ఉత్తమ్‌ ఘాటైన కౌంటర్‌ ఇచ్చారు. 

ఉత్తమ్‌ లేఖలోని ముఖ్యాంశాలు యథాతథంగా.. 
గౌరవనీయులైన అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి, నమస్కారాలు.. 
‘మీ మేనల్లుడు, ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు గారు నాకు రాసిన లేఖలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని తేల్చేశారు. చంద్రబాబుతో పొత్తు వల్ల రేపటి మీ ప్రభుత్వంలో అంటూ ముందుగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని తేల్చి చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అందుకు మీకు ధన్యవాదాలు. హరీశ్‌రావు లేఖ ద్వారా మీరు ఇప్పటివరకు చెప్పిన టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు అనే కల చెదిరిపోయింది. మీరు ఇక ఫాంహౌస్‌కు పరిమితమయ్యే సమయమొచ్చింది. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ రాబోతోంది.
 
వ్యతిరేక పార్టీ ఎలా అయింది.. 
మీరు 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్‌ విజయం సాధించింది. 2009లో మహాకూటమి పేరుతో టీడీపీతో వెళ్లారు. అయినా కాంగ్రెసే గెలిచింది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని తేల్చిచెప్పారు. అలాంటప్పుడు టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ ఎలా అయిందో చెప్పలేదు. తెలంగాణ సంపదంతా దోచుకొని ఇప్పుడు మూఢ నమ్మకాలతో పాలన చేతకాక ముందుగానే దిగిపోయి ఎన్నికలంటే భయపడుతూ మా పొత్తులపై ఆందోళన చెందుతున్నారు. మా పొత్తులు షరతులా, శరమ్‌ లేని పొత్తులా అని మీరు ప్రశ్నించారు. శరమ్‌ లేని పొత్తులు పెట్టుకుంది మీరు. మీరు ఇప్పడు ఆంధ్ర పార్టీ అని మొత్తుకుంటున్న టీడీపీతో 2009లో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎంతో కూడా పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు మీది శరమ్‌ లేని పొత్తా? సిగ్గులేకుండా రాజకీయ ఫిరాయింపులకు పాల్పడి టీడీపీకి చెందిన తలసాని శ్రీనివాస్‌ లాంటి వాళ్లకు మంత్రి పదవి ఇచ్చారు. తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డ మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు లాంటి వాళ్లకు మంత్రి పదవులిచ్చినప్పుడు శరమ్‌ గుర్తుకు రాలేదా? తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నప్పుడు, రాయల తెలంగాణ కావాలన్న ఆ పార్టీని స్నేహ పార్టీ అన్నప్పుడు మీకు శరమ్‌ లేదా? 

ప్రజాస్వామ్య తెలంగాణ వస్తుందనుకున్నాం 
తెలంగాణ ఏర్పడ్డాక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడుతుందని భావించాం. దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఏర్పడుతుందని భావించాం. కానీ నేడు తెలంగాణ అంటే ముందుగా గుర్తుకొచ్చేది రైతుల ఆత్మహత్యలు, 2 లక్షల కోట్ల అప్పులు, లక్ష కోట్ల అవినీతి, అబద్ధాలు, అత్యాచారాలు, నేరాలు, రాజకీయ ఫిరాయింపులు, రాజ్యాంగ విరుద్ధ పనులు, ప్రజాస్వామ్యవాదులను నిర్బంధించిన విషయాలే గుర్తుకు తెస్తుంది. ఒంటరిగా పోటీ చేసినా టీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించే సత్తా కాంగ్రెస్‌కు ఉంది. కానీ టీఆర్‌ఎస్‌ను నామ రూపాల్లేకుండా చేసి తెలంగాణలో అడ్రస్‌ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కొన్ని సిద్ధాంత సారూప్యత ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాం. అయినా మేం ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకేంటి? మేం ప్రజలకు జవాబుదారులం. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అనడం మీ చేతకానితనానికి, రాష్ట్ర ప్రయోజనం పట్ల మీ చిత్తశుద్ధి లేమికి పరాకాష్ట. మీరు చేస్తే సంసారం అవుతుంది.. మేం పొత్తు పెట్టుకుంటే ద్రోహం అవుతుందా?
 
ఫాంహౌజ్‌లో పడుకున్నారా? 
ఖమ్మంలో 7 మండలాలను చంద్రబాబు గుంజుకున్నాడని సిగ్గులేకుండా చెబుతున్నారు. తెలంగాణ సాధించామని గొప్పలు చెప్పుకొంటున్న మీరు.. 7 మండలాలు పోతుంటే పోరాటాలు చేయలేరా? 460 మెగావాట్ల సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టు, లక్షలాది ఎకరాల దేవాలయ, అటవీ భూములు ఆంధ్రాలో కలుస్తుంటే కళ్లు మూసుకుని ఫాంహౌస్‌లో పడుకున్నారా? మహారాష్ట్రతో గొప్ప ఒప్పందాలు చేసుకున్నామని గాడిదల మీద ఊరేగి గొప్పలు చెప్పకొన్న మీరు.. పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోలేరా? ఇదేనా మీ తెలివి.. దద్దమ్మలా.. సన్నాసులా? ఓ ముఖ్యమంత్రి గుంజుకుంటే చూస్తున్న ముఖ్యమంత్రి దద్దమ్మ అని ఒప్పుకున్నట్లే కదా? పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని చంద్రబాబు 30 లేఖలు రాశారని చెప్పడం మీ చేతకానితనానికి పరాకాష్ట. తెలంగాణ ఎగువ రాష్ట్రం. ఆంధ్ర దిగువ రాష్ట్రం. అలాంటప్పుడు మనం కడుతున్న ప్రాజెక్టులను చంద్రబాబు ఎలా ఆపుతారు?

పోలవరం ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించడం వల్ల తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీలను చంద్రబాబు అడ్డుకుంటున్నారడం మీ దద్దమ్మ చేష్టలకు పరాకాష్ట. ఎగువన ఉన్న మనం నీటిని వదిలితేనే ఆంధ్రకు పోతాయి. మరి బాబు మన నీటిని ఎలా అడ్డుకుంటారో అర్థం కావట్లేదు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లడగమన్నారు. మరి ఇప్పుడు ఇంటింటికీ నీరు వచ్చిందా? సీలేరు గురించి ఒక్కసారైనా కేంద్రానికి ఫిర్యాదు చేశారా? మీ ఎంపీలు ఢిల్లీలో గడ్డి పీకుతిన్నారా? మీ 12 ప్రశ్నల్లో ఒక్కటీ తెలంగాణ ప్రజలకు పనికొచ్చేది లేదు. అవన్నీ మీ చేతకానితనాన్ని, అసమర్థతను, పాలనా వైఫల్యాలను, దద్దమ్మ వేషాలను బయటపెడుతున్నాయి. రాజకీయాల్లో పొత్తులు, కూటములు సహజంగా జరుగుతుంటాయి. అధికారంలో ఉండి ప్రతిపక్షాల ఐక్యతను చూసి భయపడుతున్నారంటేనే మీ ఓటమిని ఒప్పుకొన్నట్లే లెక్క. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement