
మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న సీఎల్పీనేత జానారెడ్డి. చిత్రంలో డీకే అరుణ, భట్టి, సంపత్, జీవన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో విపక్ష సభ్యులంటే లెక్కలేనట్లుగా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని విపక్ష నేత జానారెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నేత వాదన ఏమిటో కూడా వినే పరిస్థితుల్లో అధికార సభ్యులు లేరని.. సభ జరుగుతున్న విధానం అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. అందుకే అసెంబ్లీని ఒక రోజు బహిష్కరించామన్నారు. మంగళవారం అసెంబ్లీని బహిష్కరించిన అనంతరం జానారెడ్డి మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ‘‘ప్రజల ఆశలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ పనిచేస్తుందనుకున్నాం. కానీ సభలో అధికార పార్టీకే ప్రాధాన్యం లభిస్తోంది. మేం చెప్పిన విషయాలు అధికార సభ్యులు వినాలి. కానీ మావైపు చూడటం లేదు. మైక్ ఇచ్చినా మాట్లాడేలోపే కట్ చేస్తున్నారు. సభ్యులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు’’అని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో గంటల తరబడి మాట్లాడితే గొప్పా అంటూ అధికార పార్టీ నేతలను నిలదీశారు. ప్రసార సాధనాలు ప్రభుత్వపక్షం తీరునే చూపిస్తున్నాయని, ప్రతిపక్షాల గొంతును వినిపించడం, చూపించడంలేదని.. ఈ అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం రాలేదన్నారు. బీఏసీ నిర్ణయానికి తాము కట్టుబడటం లేదన్న ప్రభుత్వ వాదన అవాస్తవమన్నారు. ‘‘అసలు వాయిదా తీర్మానానికి అర్థం ఉందా లేదా? బీఏసీలో జరిగింది వేరు... వాళ్లు చెబుతున్నది వేరు. ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాలని ఏకపక్షంగా నిర్ణయించారు. ఏకగ్రీవంగా అంగీకరించామని ఇప్పుడు హరీశ్ చెప్పడం సరికాదు. వాయిదా తీర్మానం రూల్‌లో ఉందా లేదా? ప్రజల తరఫున మాట్లాడేందుకు అవకాశం లేకపోతే ఎలా? స్పీకర్ స్పష్టత ఇవ్వకపోతే ఎవరిస్తారు..? సమస్యలు సభ ద్వారా పరిష్కారమవుతాయని ఎలా ఆశించాలి? అని జానారెడ్డి ప్రశ్నించారు. వాయిదా తీర్మానం అంటే అత్యవసర విషయంపై చర్చించడమేనని, సభలో కాంగ్రెస్ సభ్యుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
అసెంబ్లీ పబ్లిక్ మీటింగ్ కాదు: భట్టి
అసెంబ్లీలో ప్రతిపక్షం లేచి నిలబడితే మైక్ ఇవ్వడం సంప్రదాయమని, కానీ విపక్ష నేత లేచి పదేపదే మైక్ అడిగినా ఇవ్వకపోవడం సభా సంప్రదాయాలను తుంగలో తొక్కడమేనని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క విమర్శిం చారు. రెండ్రోజులుగా ప్రతిపక్ష నేత మైక్ అడిగితే ఇవ్వటం లేదని.. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. ‘బీఏసీలో బిజినెస్ ఏమిటో తెలియదు. సమావేశంలో సభ్యులెవరూ లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ పబ్లిక్ మీటింగ్ వేదిక కాదు.. చట్ట సభ అని గుర్తుంచుకోవాలి. సభలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు రాజ్యాంగం మాట్లాడే హక్కు కల్పించింది. నిబంధనలకు అనుగుణంగా స్పీకర్ వ్యవహరించడం లేదు. సభ్యులకు అగౌరవం ఎదురవుతోంది’’అని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment