
సాక్షి, హైదరాబాద్: పోడుభూముల సమస్యను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా కాలయాపన చేయడం వల్లే ఫారెస్ట్ అధికారి బలయ్యారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోడురైతులకు చట్టబద్ధంగా హక్కులు కల్పించాలని రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అసెంబ్లీ లోపలా, బయటా మొర పెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు.
భూమికి, మనిషికి అవినాభావ సంబంధం ఉందని, ఆడవిలో పుట్టినబిడ్డలకు అడవిపై హక్కులేదనడం సరికాదని పేర్కొన్నారు. అటవీహక్కుల చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్లే సమస్య జఠిలం అవుతోందన్నారు. ఎమ్మెల్యేలు చైర్మన్‌గా ఉండే ల్యాండ్ అసైన్డ్ కమిటీ సమావేశాలు టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయడం వల్ల అనేక సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు.
భూమి సమస్యలను పెండింగ్‌లో పెట్టడం వల్ల అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వివరించినట్లు చెప్పారు. భూసేకరణ చేపట్టినప్పటికీ ఇళ్లపట్టాలు పంపిణీ చేయని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. పార్టీ పిలుపు మేరకు గురువారం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో లబ్ధిదారులు పెద్దఎత్తున తరలివచ్చి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు.
జాతిపిత మహాత్మాగాంధీని చంపిన గాడ్సే పార్టీ బీజేపీ అని పలుమార్లు విమర్శించిన మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం విచారకరమన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయాలను తాను గౌరవిస్తానని అన్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న అభిప్రాయభేదాలపై తాను చొరవ తీసుకొని మాట్లాడతానని చెప్పారు. సామాజిక తెలంగాణ దిశగా అడుగులు పడుతున్న క్రమంలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి శ్రీనివాస్‌రావు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడాన్ని భట్టి ఖండించారు. ప్రభుత్వ అధికారిగా కాకుండా శ్రీనివాస్‌రావు వ్యక్తిగతంగా కేసీఆర్ కాళ్లు మొక్కినా, కడిగినా, నొక్కినా తమకు అభ్యంతరంలేదని పేర్కొన్నారు.
పక్కదారిపట్టిస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వేసే ఎత్తులే ఈడీ, ఐటీ, జీఎస్‌టీ దాడులని భట్టి ధ్వజమెత్తారు. విధినిర్వహణలో భాగంగా జరిగే ఐటీ దాడులనూ టీఆర్‌ఎస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment