
సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా టీడీపీ సర్కారుపై విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనని పవన్.. ఒక్కసారిగా రూటు మార్చారు. చంద్రబాబు సర్కారులో అవినీతి అమాంతం పెరిగిపోయిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. బాబు తనయుడు లోకేశ్ అవినీతిపరుడని, అతని అవినీతిపై ఆధారాలు కూడా ఉన్నాయని ప్రకటించి.. టీడీపీ వర్గాల్లో కాక రేపుతున్నారు.
ఈ సంగతి ఇలా ఉండగా సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలకు సంబంధించిన ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ కార్యకర్త మొదట మహాత్మాగాంధీ.. మహాత్మాగాంధీ అంటూ నినదించగా.. జై అంటూ తోటి కార్యకర్తలు నినదించారు. అతను అంతటితో ఆగకుండా ‘జోహార్ పవన్ కల్యాణ్’ అంటూ నినాదమివ్వగా.. మిగతా కార్యకర్తలు కూడా ‘జోహార్ జోహార్’ అంటూ ప్రతిస్పందించి.. వెంటనే నాలుక కరుచుకున్నారు. ఈ సందర్భంగా మిగతా కార్యకర్తలు ఇదేంటి అని వారించడం వీడియోలో చూడొచ్చు. అమరులైన వారికి మాత్రమే జోహార్లు అర్పించడం పరిపాటి. ‘జోహార్ పవన్ కల్యాణ్ ఏంట్రా నాయనా!’ అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పాపం జనసేన కార్యకర్తలకు ఎండదెబ్బ తగిలి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని సైటెర్లు విసురుతున్నారు. ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ కూడా ఈ వీడియోను సరదాగా రీట్వీట్ చేశారు.
"జోహార్ పవన్ కళ్యాణ్" ఏంట్రా నాయనా! https://t.co/fov7L7NHwS
— Kathi Mahesh (@kathimahesh) March 22, 2018