సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ సమస్యపై చలో అసెంబ్లీ చేపట్టిన బీజేవైఎం కార్యకర్తల అరెస్టులు, నిరుద్యోగుల అంశాలపై చర్చ కోసం బీజేపీ పట్టుబట్టడంతో మంగళవారం శాసనసభ కొంతసేపు అట్టుడికింది. వాయిదా తీర్మానంపై చర్చించాలన్న డిమాం డ్‌ను స్పీకర్ తిరస్కరించి, ప్రశోత్తరాలను ప్రారంభించడంతో బీజేపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. స్పీకర్ అనుమతితో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మైకును బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి లాగేశారు.
సభ మొదలుకాగానే..
సభ మొదలవుతూనే.. నిరుద్యోగుల సమస్యపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ బీజేపీపక్ష నేత కిషన్‌రెడ్డి పట్టుబట్టారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ప్రస్తావించారు. అయితే ఈ విజ్ఞప్తిని తిరస్కరించిన స్పీకర్.. ప్రశ్నోత్తరాలు ముగిశాక చర్చిద్దామని సూచించారు.
స్పీకర్ అవకాశమివ్వడంతో వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర అంశంపై కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడడం ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీజేపీ సభ్యుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో జీవన్‌రెడ్డి మైకును పక్కనే నిలబడి ఉన్న బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి లాగేశారు. దీన్ని స్పీకర్, కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టారు.
సీఎం సూచన మేరకు వెనక్కి తగ్గినా..
కాసేపటికి సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాల్సిం దిగా బీజేపీ సభ్యులను కోరారు. సమస్యలపై ప్రభుత్వ దృష్టి పడేందుకు చలో అసెంబ్లీ నిర్వహిస్తారని, తప్పేంలేదన్నారు. కానీ అంగన్‌వాడీ వర్కర్ల ఆందోళన హింసాత్మ కంగా మారిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలపై నిషేధాజ్ఞలు విధించాల్సి వస్తోందని, అందులో భాగంగా అరెస్టులు జరుగుతాయని, దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని సూచించారు.
దాంతో బీజేపీ సభ్యులు వెళ్లి వారి సీట్లలో కూర్చున్నారు. ఆ వెంటనే స్పీకర్ తిరిగి ప్రశ్నోత్తరాలను ప్రారంభించడంతో.. బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కిషన్‌రెడ్డికి మాట్లాడే అవకాశమిచ్చారు. యువతలో ఉద్యోగాల కల్పనపై తీవ్ర ఆందోళన ఉందని, దాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే బీజేవైఎం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తాము కూడా అందుకే వాయిదా తీర్మానం కోరామని, ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి.. బయటికి వెళ్లిపోయారు.
సీఎం ఏం చేస్తున్నారు: అక్బరుద్దీన్
బీజేపీ సభ్యులు వాకౌట్ చేయగానే మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ మాట్లాడారు. జీవన్‌రెడ్డి మైకును బీజేపీ సభ్యుడు లాగిన తీరుపై సీఎంగానీ, స్పీకర్‌గానీ సరిగా స్పందించలేదని తప్పుబట్టారు. కనీసం విచారం వ్యక్తం చేయాల్సిందిగా కూడా కిషన్‌రెడ్డిని కోరక పోవడం దారుణమని వ్యాఖ్యానించారు. సభ ఆర్డర్‌లో లేనప్పుడు ప్రశ్నోత్తరాలు ఎలా కొనసాగిస్తారని, కనీసం వాయిదా వేసి ఉండాల్సిందని.. ఇలా సంప్రదాయాలు లేని సభలో తాను ఉండటం సరికాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరికి ఈ వాదనపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. చిన్నచిన్న అంశాలను వివాదాస్పదం చేయడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment