ధుమ్కా స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేస్తున్న హేమంత్ సోరెన్
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో వైఫల్యం, హరియాణాలో మెజార్టీ రాక జన్‌నాయక్ జనతా పార్టీ(జేజేపీ) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, గత ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన తరుణంలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమల దళం కఠిన పరీక్ష ఎదుర్కోబోతోంది. లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య తేడాపై ఈ మధ్య కాలంలో ఓటర్లలో అవగాహన పెరిగిపోయింది. బీజేపీ, ప్రతిపక్ష జేఎంఎం, కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
లాలూ ప్రసాద్ యాదవ్ బీజేడీ కూడా విపక్ష కూటమిలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి అంతగా బలం లేదు. మహారాష్ట్ర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో నైతిక స్థైర్యాన్ని పెంచడంతో పాటు ఈ కూటమి స్థానిక సమస్యే ఎజెండాగా బరిలో దిగింది. బీజేపీ స్థానిక సమస్యలతో పాటు అయోధ్యలో మందిర నిర్మాణం, కశ్మీర్ అంశాలను ప్రస్తావిస్తూ సుస్థిర పాలన, భద్రత ఎజెండాలుగా చేసుకుంది. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ సర్కార్ అయిదేళ్లుగా అధికారంలో కొనసాగి రికార్డు సృష్టించింది. వ్యక్తిగతంగా కూడా రఘుబర్ దాస్ ప్రజాకర్షణ కలిగిన నేత. ఇవన్నీ బీజేపీకి కలిసొచ్చే అంశాలు.
అన్నీ సంకీర్ణాలే
జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ కట్టబెట్టిన చరిత్ర జార్ఖండ్ ప్రజలకు లేదు. 2014 ఎన్నికల్లో కలిసిపోటీ చేసిన బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) కూటమికి 41 సీట్లతో సింపుల్ మెజార్టీ వచ్చింది. దీంతో అయిదేళ్లలోనే స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైంది. అంతకు ముందు చరిత్ర అంతా ఏ పార్టీకి మెజార్టీ రాక సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ట్రపతి పాలనతో గడిచి అభివృద్ధి అన్నదే ప్రజలు చూడలేదు.
సహజవనరులు కలిగిన శాపగ్రస్థ రాష్ట్రం
సహజవనరులు అత్యధికంగా ఉన్నప్పటికీ శాపగ్రస్థ రాష్ట్రంగా పేరుపొందిన రాష్ట్రమిది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఇటీవల కాలంలో దారిద్య్రం 74.9% నుంచి 46.5శాతానికి తగ్గింది. అయినప్పటికీ రైట్ ఫర్ ఫుడ్ అనే సంస్థ అంచనాల ప్రకారం 2018లో 11 ఆకలి చావులు నమోదయ్యాయి. దేశంలో అత్యంత పేదరికం ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా మిగిలింది. దీంతో ఉద్యోగాలు, వాణిజ్యానికి అనుకూలంగా తీసుకునే ప్రభుత్వ విధానాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి.
ఆదివాసీల సెంటిమెంట్
గత ఎన్నికల్లో బీజేపీ 28 ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో 13 గెలుచుకొని పట్టు బిగించింది. కానీ ఈ సారి గిరిజనుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ పట్టుకోల్పోతోందని అంచనా. గిరిజన గ్రామాల సార్వభౌమత్వాన్ని బీజేపీ అణిచివేస్తోందన్న అసంతృప్తి ఆదివాసీల్లో నెలకొంది. భూ బ్యాంకుల వ్యవహారం కూడా ఆదివాసీ ప్రాంతాల్లో సమస్యలు సృష్టిస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో కమలానిదే హవా
మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ–ఏజేఎస్‌యూ కూటమి మొత్తం 14 లోక్‌సభ స్థానాలకుగాను 13 చోట్ల గెలిచి 55.3% ఓట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో ఆ స్థాయి మెజార్టీ సాధించగలదా అన్న సందేహాలున్నాయి.
మొత్తం అసెంబ్లీ స్థానాలు : 81
అయిదు దశల్లో ఎన్నికలు
నవంబర్ 30, డిసెంబర్ 7,
డిసెంబర్ 12, డిసెంబర్ 16,
డిసెంబర్ 20న ఎన్నికలు
ఫలితాలు వెల్లడి : డిసెంబర్ 23
తొలిదశ పోలింగ్ నేడు!
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని సుమారు 13 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. మొత్తం ఆరు జిల్లాల్లోని ఈ స్థానాల్లో సుమారు 37 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 18 లక్షల మంది మహిళలున్నారు. పదమూడు స్థానాల్లో మొత్తం 189 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటూండగా.. పోలింగ్ కోసం 3,906 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయని, వీటిల్లో 899 స్టేషన్లలో వెబ్‌క్యాస్టింగ్ సౌకర్యం ఉందని ఎన్నికల కమిషన్‌తెలిపింది. బీజేపీ12 స్థానాల్లో పోటీ చేస్తూండగా, హుస్సేయినాబాద్ స్థానంలో కాషాయ పార్టీ స్వతంత్ర అభ్యర్థి వినోద్ సింగ్‌కు మద్దతిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాల్సిన సిబ్బందిని వాయుమార్గం ద్వారా ఆయా స్టేషన్లకు చేరవేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను నిరోధించేందుకు ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు పనిచేస్తున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment