
సాక్షి, అమరావతి : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బందరు పోర్టుకు శంకుస్థాపన జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ గుర్తుచేశారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బందర్ పోర్టు నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. ‘బందరు పోర్టు నిర్మించి కొన్ని వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వైఎస్సార్ ఆలోచన చేశారు. బందరు పోర్టుకు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక బందరు పోర్టుపై మాట నిలబెట్టుకోలేదు. పైగా పోర్టు నిర్మాణానికి 28 గ్రామాల్లో 33 వేల ఎకరాలు కావాలని నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఓడరేవు నిర్మాణానికి ఇన్ని ఎకరాలు ఎందుకని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా బాధిత గ్రామాల తరఫున పోరాటం చేశారు. దీంతో స్పందించిన చంద్రబాబు సర్కార్ ఆ భూ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తామని చెప్పింది. అయితే ఎన్నికలకు మూడు నెలల ముందు బందరు పోర్టు నిర్మాణం జరిగిపోయిందనే రీతిలో హడావుడి చేసింది. తీరా చూస్తే ట్రాలీలో ఓడను తెచ్చి పరిసర గ్రామాల్లో ఊరేగించార’ని తెలిపారు.
అలాగే చంద్రబాబు సర్కార్ తీసుకువచ్చిన బలవంతపు భూ సేకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని జోగి రమేశ్ ప్రభుత్వాన్ని కోరారు. సాధ్యమైనంత త్వరలో బందరు పోర్టు నిర్మాణాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై అంతకు ముందు మాట్లాడిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. బందరు పోర్టు నిర్మాణం కోసం మహానేత వైఎస్సార్ హయాంలోనే శంకుస్థాపన జరిగిందని.. అందుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయని తెలిపారు. పోర్టు కోసం నాలుగువేల ఎకరాల భూ సేకరణ జరిగిందన్నారు. కానీ చంద్రబాబు అవసరానికి మించి భూ సేకరణ చేపట్టారని మండిపడ్డారు. పైగా ఎన్నికలకు ముందు రూ. 10 కోట్లు ఖర్చు పెట్టి పోర్టు నిర్మాణం జరుగుతుందనే రీతిలో ఆర్భాటం చేశారని విమర్శించారు. బలవంతపు భూ సేకరణ చట్టాన్ని డీ నోటిఫికేషన్ చేయాలని కోరారు.
సభ్యులు ప్రస్తావించిన అంశాలపై పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. బందర్ పోర్టు నిర్మాణ అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బందర్ పోర్టు భూ సేకరణ చట్టాన్ని డీ నోటిఫికేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఐదేళ్లలో తప్పకుండా బందరు పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని తెలిపారు.