సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని విన్యాసాలు, యాత్రలు చేసిన ప్రజల నమ్మరని ఆయన అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మజ్లిస్‌కు కొమ్ము కాస్తూ టీఆర్ఎస్ పార్టీ మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏవిధమైన రాజకీయాలకు పాల్పడ్డారో జనమంతా చూశారని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సమయంలో కేవలం ఐదు రాష్ట్రాల్లో ఉన్న తాము, ఇప్పుడు 22 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామన్నారు. 90 శాతం క్రైస్తవులు ఉన్న నాగాలాండ్, ముస్లింలు అధికంగా ఉన్న జమ్మూకాశ్మీర్ లోనూ బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు.
కేసీఆర్ పెట్టే ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ కాదు ఫ్యామిలీ ఫ్రంట్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాఫ్ట్రంలో 4000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటి వరకు వారికి మొత్తం పరిహారం ఇవ్వలేదన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో కమిషన్ కాసుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. రైతు బంధు పథకం మొత్తం భూస్వామి బంధు పథకంగా మారిపోయింది. కేసీఆర్ ప్రభుత్వంపై రైతు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, సర్వరోగ నివారిణిలా రైతు బంధు పథకాన్నే కేసీఆర్ వల్లిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర నిధుల్లో 40 కోట్లు మజ్లిస్ పార్టీకి కేటాయించారని ఆరోపించారు. టీఆర్ఎస్ చెల్లని రూపాయి, టీడీపీ పేలని తుపాకీ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతికి భక్తునిగా వస్తే టీడీపీ గుండాలతో దాడి చేయించారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment