
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకాన్ని రాబందు పథకమంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. ఉత్తమ్‌వి ఉత్తమాటలేనని, రైతుబంధు పథకాన్ని రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు అభినందిస్తున్నారని ఆయన తెలిపారు.
సచివాలయంలో గురువారం కడియం విలేకరులతో మాట్లాడారు. ఈ నాలుగేళ్లలో కాంగ్రెస్ ఊహించని విధంగా రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, ఎకరాకు రూ.4 వేలు, ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకం వంటి ఎన్నో కార్యక్రమాల్ని ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఉత్తమ్ అవగాహనతో మాట్లాడాలని కడియం సూచించారు.