విలేకరులతో మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(సెంట్రల్): రైతుల పేరు చెప్పి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దోచుకోవడమే అభివృద్ధా? అంటూ వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బండేపల్లి కాలువ అభివృద్ధి అనేది స్థానిక రైతుల కలని పేర్కొన్నారు. ఈ కాలువ అభివృద్ధికి తాను ప్రజాప్రతినిధిగా అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే రైతుల సమస్యలు పరిష్కరించకుండా, కాలువను అభివృద్ధి చేయకుండా ఆ వంకతో రూ.కోట్లు దోచుకోవాలని చూస్తే మాత్రం సహించనని హెచ్చరించారు. దివంగత మహానైత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల కోసం ఎంతో చేశారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రైతుల కోసం పాటుపడుతున్నారని వెల్లడించారు.
హామీ ఏమైంది?
మనుబోలు మండలం బండేపల్లి కాలువ కింద 12500 ఎకరాల వరకు సాగుచేసుకునేందుకు వీలుందని, అయితే కాలువలో నీటి వసతి లేక పోవడంతో రైతులు సాగును ఆపేశారన్నారు. బండేపల్లి కాలువను పూర్తి చేసి నీరు ఇచ్చిన తర్వాత రానున్న ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని, 2014 ఎన్నికల సమయంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న సోమిరెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లయినా ఇప్పటివరకూ పనులు చేయలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో హడావుడిగా టెండర్లు వేసి పనులు చేస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
నిబంధనలు ఉల్లఘించి టెండర్‌లా?
టెండర్‌లు వేయాలంటే నిబంధనల ప్రకారం రూ.5 లక్షలు దాటితే టెండర్లు పిలవాలని, కానీ బండేపల్లి కాలువకు సంబంధించి రూ.31 కోట్ల పనులకు షార్ట్ టెండర్‌ల పేరుతో దోచుకోవాలని చూడడం దుర్మార్గమన్నారు. నిబంధనల ప్రకారం టెండర్లు వేస్తే రూ.12 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుందన్నారు. కాని సొంత కాంట్రాక్ట్ పనులు కోసం నిబంధనలు ఉల్లంగించడం ప్రజల సొమ్ముదోచుకోవడమేనని ఆరోపించారు. కుమారుడి కాంట్రాక్ట్ పనుల కోసం ఎవరినీ టెండర్లు వేయవద్దని మంత్రి సోమిరెడ్డి ఆదేశాలు జారీ చేయలేదనే విషయాన్ని కాణిపాకంలో ప్రమాణం చేసి చెప్పగలరా? అని గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు.
ఆ లేఖ వెనుక ఎవరున్నారు?
బండేపల్లి కాలువ కింద 12500 ఎకరాల సాగు చేసుకోవచ్చన్నారని, అయితే గత ఐఏబీ సమావేశంలో ఈ ప్రాంతానికి నీరు ఇవ్వలేమని బోర్డు సమావేశం నుంచి ఆ ప్రాంతాన్ని అధికారులు తొలగించిన విషయాన్ని కాకాణి గుర్తు చేశారు. కానీ మూడు నెలల్లో ఈ కాలువ పనులు పూర్తిచేస్తే 12500 ఎకరాలకు 2018 ఖరీఫ్‌కు నీరు ఇవ్వొచ్చని సాక్షాత్తు సంబంధిత చీఫ్ ఇంజినీర్ లేఖ రాయడం వెనుక ఎవరు ఉన్నారనే విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరి ఒత్తిడితో ఈ విధంగా లేఖ రాశారని, ఒక సం స్థకు ఇస్తే మూడు నెలల్లో పూర్తి చేస్తారనే విషయం కూడా ఆ లేఖలో ఉందన్నారు. భూమి సేకరణ పూర్తి చేసి ఇస్తే పనులు చేస్తామని సంబంధిత కంపెనీ చెప్పిందన్నారు. దీన్ని బట్టి చూస్తే కనీసం ఇంతవరకు భూసేకరణ కూడా జరగలేదని, అలాంటిది మూడు నెలల్లో ఏవిధంగా కాలువ పనులు పూర్తిచేసి నీరు ఇస్తారని? ప్రశ్నించారు. బండేపల్లి కాలువ నీటి కోసం తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు.
కోర్టులు అభివృద్ధిని అడ్డుకుంటాయా?
తాను అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తానని, అభివృద్ధిని ప్రశ్నించనని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలపై తాను కోర్టుకు పలు సందర్భాల్లో వెళ్లానన్నారు. అయితే గోవర్ధన్‌రెడ్డి కోర్టులకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి సోమిరెడ్డి అనడం చూస్తుంటే న్యాయస్థానాలపై మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకోవడం సిగ్గుచేటన్నారు. సోమిరెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బండేపల్లి కాలువ పనుల విషయంలో తాను మాట్లాడుతున్న దానిపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. సమావేశంలో మందల వెంకటశేషయ్య, నెల్లూరు శివప్రసాద్, మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్, తలమంచి సురేంద్రబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment