
అంబాసిడర్ కారు నడుపుకుంటూ నామినేషన్ కేంద్రానికి వెళ్తున్న కవిత. చిత్రంలో నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి గణేశ్ గుప్తా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజాకూటమిలో ప్రజలు లేరని, కేవలం పైరవీకారులు మాత్రమే ఉన్నారని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రజల హృదయాల్లో లేని మహాకూటమి మట్టి కరవడం ఖాయమని జోస్యం చెప్పారు. గురువారం నిజామాబాద్ రూరల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారో చెప్పే ధైర్యం కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. కేసీఆర్‌ను గుడ్డిగా విమర్శించడం తప్ప.. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల అభ్యున్నతికి ఏం చేశారో చెప్పే ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు లేదన్నారు. కూటమికి ఓటేస్తే రాష్ట్రం అథోగతేనన్నారు.
భూపతిరెడ్డి రాజీనామా చేయాలి
ఎమ్మెల్సీ పదవి పొంది పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే పదవికి రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఆయనను ప్రజలు ఎప్పుడో సస్పెండ్ చేశారన్నారు. రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ సస్పెన్షన్ సిఫార్సుపై జిల్లా ప్రజా ప్రతినిధులందరం కట్టుబడి ఉన్నామన్నారు.
కారు నడిపిన కవిత
ఎంపీ కవిత గురువారం కారు నడిపి సందడి చేశారు. నిజామాబాద్ అర్బన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేష్‌గుప్త నామినేషన్ కార్యక్రమంలో భాగంగా మారుతీనగర్‌లోని ఆయన నివాసానికి కవిత వచ్చా రు. అక్కడి నుంచి గులాబీ కారును నడుపుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లారు. కారు నడుపుతున్న కవితను రోడ్డుపై వెళ్లేవారు ఆసక్తిగా చూశారు. కారులో అభ్యర్థి గణేష్‌గుప్తతో పాటు నగర మేయర్ ఆకుల సుజాత, పోశెట్టి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment