
సాక్షి, న్యూఢిల్లీ : మీరట్ బీజేపీ నాయకుడు వినీత్ శారద ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ పార్టీ గుర్తు కమలంకు ఓటేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఈ సందర్భంగా ‘కమల్, కమల్, కమల్, కమాల్’ అంటూ ర్యాప్ శైలిలో నినదించిన 32 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన వీడియోకు సోషల్ మీడియా యూజర్లు తమ చమత్కారాన్ని జోడించి మరింత వైరల్‌కు కారణం అవుతున్నారు.
మీరట్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న రాజేంద్ర అగ్రవాల్ ఏప్రిల్ రెండవ తేదీన ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో స్థానిక బీజేపీ నాయకుడు వినీత్ శారద మాట్లాడుతూ ‘ఆప్ కో సోచనా హోగా, కమల్ ఛాయిహే యా క్యా ఛాయిహే’ కమల్, కమల్, కమల్, కమల్ అంటూ పాటందుకొని పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయారు. దాన్ని చూసిన ఓ సోషల్ మీడియా యూజర్ ఆ వీడియోలోని వినీత్ శారద ఆడియోను కట్‌చేసి ‘నాజీలను ఉద్దేశించి హిట్లర్ ఆవేశంగా ఉపన్యసిస్తున్న వీడియో’కు జత చేశారు. అలాగే మరో సోషల్ యూజర్ ఆ ఆడియో భాగాన్ని తీసుకెళ్లి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ శ్రీశ్రీ రవిశంకర్’ పూనకంతో ఊగిపోతున్న వీడియోకు జత చేశారు. దాంతో కమల్ కాస్త చివరకు గోల్‌మాల్ అయింది. ఏ మాల్ అయితే ప్రచారమే ‘గోల్’ అయినప్పుడు.