నవంబరు ఏడున కాదు. ఐదో తేదీన బర్త్‌డే వేడుకలకు విశ్వనాయకుడు కమల్‌హాసన్ సిద్ధం అయ్యారు. చెన్నై శివారులోని కేలంబాక్కం వేదికగా ఐదో తేదీన వేడుకలకు అభిమానలోకం భారీ ఏర్పాట్లలో నిమగ్నం అయింది. ఈ వేడుకకు దక్షిణాది రాష్ట్రాల్లోని ముఖ్య అభిమానుల్ని మాత్రం ఆహ్వానించనున్నారు. పేదలకు సంక్షేమ పథకాల పంపిణీ సాగనుంది. ఇందులో కమల్ ప్రసంగం ఎలా ఉంటుందో అని ఎదురు చూపులు పెరిగాయి.
సాక్షి, చెన్నై : ఏడో తేదీన కమల్ హాసన్ జన్మదినం. అయితే, ఐదో తేదీన వేడుకలు నిర్వహించేందుకు తాజాగా ఏర్పాట్లు చేస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. లోక నాయకుడు కమల్ ట్విట్టర్ విమర్శలు, ఆరోపణల పర్వం నుంచి శనివారం ప్రజల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. శనివారం కుశస్థలి నదీ తీరంలో సాగిన తన పర్యటన గురించి కొన్ని అంశాలను ట్వీట్‌లో వివరించిన కమల్, ఆ నదీ తీరం అన్యాక్రాంతానికి తగ్గ ఆధారాలు తన వద్ద ఉన్నట్టు ప్రకటించారు. గతంలో షూటింగ్ నిమిత్తం ఆ నదిలోకి తాను దూకిన క్షణాల్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు అక్కడున్న పరిస్థితిని వివరించారు. ఉత్తర చెన్నైని పరిరక్షించుకుందామన్న నినాదానికి బలం చేకూర్చే రీతిలో కమల్ ఓవైపు పిలుపునిస్తే, మరోవైపు ఆయన పుట్టిన రోజు వేడుకలు ముందుగానే నిర్వహించేందుకు తగ్గ ఏర్పాట్ల మీద అభిమాన వర్గాలు దృష్టి పెట్టడం గమనార్హం.
కీలక ప్రకటన చేస్తారా?
కమల్ జన్మదినం రోజైన ఏడో తేదీన రాజకీయంగా ప్రకటన వెలువడవచ్చని తొలుత ప్రచారం సాగింది. అయితే, అభిమాన సంక్షేమం నినాదంతో ముందుకు సాగబోతున్నట్టుగా ప్రకటన వెలువడింది. అయినా, రాజకీయ ప్రవేశాన్ని ధ్రువీకరించే విధంగా కీలక ప్రకటనను కమల్ చేయవచ్చన్న ఎదురుచూపులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఏడో తేదీన కాదు, ఐదో తేదీనే బర్త్‌డే వేడుకలకు కమల్ నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ రోజున సంక్షేమ కార్యక్రమాలతో పాటు, ముఖ్య అభిమానులతో సమాలోచన సమావేశానికి చర్యలు తీసుకోవడంతో ఏడో తేదీన రాజకీయ అరంగ్రేటం ప్రకటన వెలువడే అవకాశాలు ఉండొచ్చన్న చర్చ ఊపందుకుంది.
ఈ వేడుకలకు వేదికగా ఓఎంఆర్ రోడ్డులోని కేలంబాక్కంలో ఉన్న చెట్టినాడు విద్యా సంస్థల ఆడిటోరియంను ఎంపికచేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి కేవలం మూడు గంటల పాటు వేడుక నిర్వహించేందుకు ముందస్తుగా చర్యలు తీసుకుని ఉండటం గమనార్హం. సంక్షేమ పథకాల పంపిణీ, పేదరికంలో ఉన్న అభిమానులకు భరోసాతో పాటు, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని అభిమాన సంఘాల ముఖ్య నేతలతో ఈ సమావేశం నిమిత్తం ఆçహ్వానాలు పంపించేందుకు నిర్ణయించి ఉన్నారు. దీంతో కమల్ రాజకీయ ప్రవేశ ఎదురుచూపులు మరింతగా పెరిగి ఉన్నాయి. ఇక, అభిమాన లోకాన్ని ఏకం చేస్తూ, ఈ వేదిక నుంచి మొబైల్ యాప్‌ను కమల్ విడుదల చేయనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
చెన్నై పోరంబోకు
ఇక, కుశస్థలి నదీ తీరంలోని ఆక్రమణలను ఎత్తిచూపుతూ చెన్నై పోరంబోకు అన్న పాటను తెర మీదకు తెచ్చే పనిలో కమల్ అభిమాన లోకం నిమగ్నం అయింది. ఇందులో భాగంగా కమల్‌తో కలిసి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన నిత్యానంద్ జయరామన్ ఈ పాటను రాశారు. థర్మల్ విద్యుత్ కేంద్రం, అక్కడి నుంచి వెలువడే బూడిద, ఎన్నూర్ హార్బర్, కుశస్థలి తీరంలో ఆక్రమణాల గురించి వివరిస్తూ రాసిన ఈ పాటను కర్ణాటక సంగీత గాయకుడు టీఎం కృష్ణన్ పాడుతారు. కబీర్ వాసుకి సంగీతాన్ని అందిస్తారు. గ్రామీణ , జానపదం, కర్ణాటక సంగీత మేళవింపుతో ఈ పాట వీనుల విందుగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment