
సాక్షి, చెన్నై: మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ సైతం కొత్త కూటమి కసరత్తుల మీద దృష్టి పెట్టారు. ఏకాభిప్రాయం ఉన్న పార్టీలు వస్తే కలిసి పనిచేయడానికి సిద్ధమేనని ప్రకటించారు. కమల్‌హాసన్ తనది ఒంటరి పయనం అని ఇప్పటికే స్పష్టం చేశారు. 40 స్థానాలకు అభ్యర్థులను ఆదివారం ప్రకటించవచ్చన్న చర్చ కూడా ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో కమల్ సైతం పొత్తు కసరత్తుల మీద దృష్టి పెట్టినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. తన నేతృత్వంలో కాకుండా, ఏకాభిప్రాయం, తమిళనాడు సంక్షేమం, అభివృద్ధి మీద చిత్తశుద్ధి, మార్పును ఆశించే వాళ్లు తనతో కలిసి వస్తే కూటమిగా ముందుకు సాగడానికి సిద్ధంగానే ఉన్నట్టుగా కమల్ స్పందించడం గమనార్హం.
ఆదివారం చెన్నై విమానాశ్రయంలో మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. మూడో కూటమి కాదని, ఏకాభిప్రాయం కల్గిన వాళ్లు, తమిళనాడు సంక్షేమాన్ని ఆకాంక్షించే వాళ్లతో కలిసి పనిచేయడానికి రెడీగానే ఉన్నామన్నారు. ఏకాభిప్రాయం కల్గిన పార్టీలు తమిళనాట ఉన్నాయని, వాళ్లతో చర్చకు సిద్ధమే అన్నట్టుగా çకమల్ స్పందించారు. ఈ వ్యాఖ్యలతో పచ్చముత్తు పారివేందర్ నేతృత్వంలోనే ఐజేకేతో పాటుగా మరికొన్ని పార్టీల నేతలు కమల్‌తో పొత్తు చర్చల్లో ఉన్నట్టు సమాచారం. కమల్‌తో ఓ ప్రైవేట్ హోటల్‌లో పచ్చముత్తు పారివేందర్ భేటీ అయినట్టుగా ప్రచారం ఊపందుకుంది. డీఎంకే, అన్నాడీఎంకేలు విస్మరించిన పార్టీలు కమల్‌హాసన్ పక్షాన చేరవచ్చన్న చర్చ జోరందుకుంది. ఇక, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దినకరన్‌తో కలిసి పనిచేయడానికి ఎస్‌డీపీఐ సిద్ధం కావడం విశేషం.