
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సీపీఐ తరపున ప్రచారం చేస్తానని జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తెలిపారు. సోమవారం సీపీఐ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కన్హయ్య కుమార్, కూటమికి సీపీఐ కట్టుబడి ఉందని అన్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో కూటమి ఏం లేకపోయినా యువత, విద్యార్థులను కలుపుకొని పోతున్నామన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అంతటా ప్రచారం చేస్తానన్నారు. తాను తెలంగాణలో కూటమి విషయాలు మాట్లాడదల్చుకోలేదని, అయితే కుల, మత రాజకీయాలను బద్దలు కొట్టడానికి కచ్చితంగా ఫ్రంట్ అవసరముందని అభిప్రాయపడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని కన్హయ్య కుమార్ అన్నారు.