
సాక్షి, ప్రకాశం: చంద్రబాబు నాలుగేళ్లలో జగన్ మోహన్ రెడ్డిని, పవన్ కల్యాణ్‌ని తిట్టుకుంటూ బతకడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. ఒంగోలు బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దాడులు చేస్తూ సంస్కారంలేని వాడిగా బాబు ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు రాష్ట్రంలోని ఏ సెక్టార్‌కి మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం షో చేస్తోందని, కేంద్ర నిధులను టీడీపీ నేతలు దోచుకుంటున్నారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ని బాబు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
రామాయపట్నం పోర్ట్ కోసం కేంద్రానికి ఎందుకు ప్రతిపాదనలు పంపడం లేదని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం వివరాలు అడుగుతుంటే ఇవ్వకుండా బాబు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం పక్కా గృహాలు అధికంగా మంజూరు చేసిందని తెలిపారు. బాబు రాష్ట్రాన్ని దోచుకుంటుంటే.. ప్రజలు వలయంగా నిలబడాలా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి రహితంగా పాలన చేస్తామని కన్నా చెప్పారు.