కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప (ఫైల్‌ఫోటో)
సాక్షి, బెంగళూర్ : ఓ వైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగానే రాష్ట్ర సీఎంగా తాను మే 17న ప్రమాణ స్వీకారం చేస్తానని బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 15న తాను ఢిల్లీ వెళ్లి 17న జరిగే తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తానని చెప్పారు. షికారిపురలో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం యడ్యూరప్ప విలేకరులతో మాట్లాడారు. 224 మంది సభ్యులు కలిగిన కర్ణాటక అసెంబ్లీలో తమ పార్టీ 145 నుంచి 150 స్ధానాలు గెలుపొందుతుందని యడ్యూరప్ప అంచనా వేశారు.
తాను రాష్ట్రమంతా మూడుసార్లు చుట్టివచ్చానని, బీజేపీ ఘనవిజయం సాధిస్తుందనే పూర్తి విశ్వాసం తనకుందని ఆయన చెప్పుకొచ్చారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని పాలక కాంగ్రెస్ సర్కార్ పట్ల ప్రజలు విసిగివేసారారన్నారు. 2008లో బీజేపీ దక్షిణాదిలో తొలిసారిగా కర్ణాటకలో అధికార పగ్గాలు చేపట్టినప్పుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 2011లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన అధికార పీఠం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment