కన్నడ ఓటర్లు
హోరాహోరీ ప్రచారానంతరం నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. విజయం తమదంటే తమదేనని కాంగ్రెస్, బీజేపీ, జేడీ ఎస్ ఇలా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా...వివిధ మీడియా సంస్థల సర్వేలు హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందంటూ చేస్తున్న ఊహాగానాలు సైతం భారీస్థాయిలోనే సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కుల, ప్రాంత సమీకరణలతో పాటు, వైవిధ్యభరితంగా ఉన్న ఆయా ప్రాంతాల్లోని స్థానిక అంశాలు, సమస్యలు కీలకంగా మారనున్నాయి.
హైదరాబాద్ కర్ణాటక...
బీదర్,యద్గిర్,రాయచూర్, కొప్పాల్, కలబురిగి, బళ్లారి జిల్లాల్లో తెలుగు మాట్లాడేవారు గణనీయంగా ఉన్నారు. సామాజిక,ఆర్థిక వెనకబాటుదనంతో పాటు నీటివనరులు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్య. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలనే నాలుగుదశాబ్దాల డిమాండ్ 2012లో యూపీఏ హయాంలో నెరవేరింది. ఫలితంగా 2013 ఎన్నికల్లో 40 కు గాను 24 సీట్లు కాంగ్రెస్ గెలిచింది.
గత అయిదేళ్లలో దీని అమలు పూర్తిస్థాయిలో జరగలేదు. నీటివనరులు, అభివృద్ది, మౌలికసదుపాయాలు, ఉపాధి అనేవి ప్రధాన అంశాలు. నిధుల కొరత, నెమ్మదించిన భూసేకరణ కారణంగా ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టులు ఊపందుకోలేదు. మూడోదశ ఎగువ కృష్ణ ప్రాజెక్ట్ ప్రారంభంలో జాప్యం ఏర్పడింది.. వరుస కరవు పరిస్థితులు ఈ ప్రాంతాన్ని కోలుకోకుండా చేశాయి. రాజకీయంగా కాంగ్రెస్‌కు పెట్టని కోటగా కొనసాగుతున్నా కులసమీకరణలు కీలకమే. 40 సీట్లలో 18 ఎస్సీ,ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ముస్లింలు, లింగాయత్‌లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. బళ్లారి బ్రదర్స్ కూడా తమ పట్టు కొనసాగిస్తున్నారు.
బొంబాయి కర్ణాటక...
భిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో మరాఠి ప్రజలు ఎక్కువగానే ఉన్నారు. బెళగావి ప్రాంతాన్ని మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ ఓ సంస్థ ఉద్యమం సాగిస్తోంది. హైదరాబాద్, బొంబాయి కర్ణాటక, బెంగళూరు, తదితర ప్రాంతాల్లో కీలకంగా మారనున్న లింగాయత్, వీరశైవులను కర్ణాటక అల్పసంఖ్యాక మతంగా సిఫారసు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది. దీనిపైనా ఈ వర్గంవారిలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. కలస బందూరి నాలా ప్రాజెక్టు ద్వారా బెళగావి, హుబ్బళ్ళి–ధార్వాడ్, గదగ్, బాగాల్గోక్ ప్రాంతాలకు మండోవి నది నీటి పంపిణీపై మహారాష్ట్ర, గోవాలతో కర్ణాటకకు వివాదం తలెత్తింది. లింగాయత్‌ల అంశం కాంగ్రెస్‌కు, మండోవి వివాదం బీజేపీకి కలిసి రావొచ్చునని భావిస్తున్నారు.
పాత మైసూరు ప్రాంతం...
ఇక్కడ కావేరి జలవివాదం నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలతో కలిసి నీటిని పంచుకోవడం విషయంలో వివాదం సాగుతోంది. ఇక్కడి రైతులకు జీవనోపాధికి ఇదే కీలకం. కొడగు జిల్లా మీదుగా పశ్చిమ కనుమలు వ్యాపించడంతో కాఫీ, నారింజ తోటలతో పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతంలో చేపట్టనున్న రైల్వేలైన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలు సంస్థలు ఉద్యమం నిర్వహిస్తున్నాయి. టిప్పుసుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసనలు వక్తమయ్యాయి. ఇక్కడ ప్రధానంగా జేడీ ఎస్– కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే బీజేపీ కూడా తుమ్‌కూరు, కొలార్ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లింది.
కోస్తా, మల్నాడ్ ప్రాంతాలు...
కోస్తా ప్రాంతం దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తరకన్నడ జిల్లాల్లో విస్తరించి ఉంది. గోరక్షక దళాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, మోరల్ పోలీసింగ్, హిందుత్వ అనుకూల శక్తుల ప్రమేయంతో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మోరల్ పోలీసింగ్‌లో భాగంగా 2009 జనవరిలో మంగళూరులోని ఓ పబ్‌పై హిందుత్వవాదులు జరిపిన దాడి సర్వత్రా చర్చనీయాంశమైంది. కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా మంగళూరు నగరంలో ఉగ్రవాద జాడలను పోలీసులు కనుక్కున్నారు. దేశంలో చోటుచేసుకున్న ఉగ్రవాద కార్యకలాపాలకు ఇక్కడ నుంచి సహాయం అందినట్టు అనుమానిస్తున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా హిందు,ముస్లింల మధ్య బాబాబుడన్‌గిరి ప్రార్థనాస్థలంపై వివాదం సాగుతోంది. ఇరువర్గాల వారు అది తమకు చెందినదిగా వాదిస్తున్నారు. రాజకీయంగా ఇక్కడ కాంగ్రెస్,బీజేపీల మధ్య తీవ్రపోటీ ఏర్పడింది.
ఇవీగాక... ప్రముఖ హేతువాది, చరిత్రకారుడు ఎం.ఎం. కలబురిగీ, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యలు కర్ణాటకలో అతి,మితవాద రాజకీయాలు పెంచేందుకు దారితీస్తున్నాయనే ఆందోళనను రాజకీయ పరిశీలకులు వ్యక్తంచేస్తున్నారు. కన్నడ ఐడెండిటీ పరిరక్షణకు కట్టుబడినట్టు సిద్ధరామయ్య ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఏ మేరకు ఉపయోగపడుతుందనేది తేలనుంది. కాంగ్రెస్, బీజేపీ పరస్పర అవినీతి ఆరోపణలకు ఓటరు ఎలాంటి తీర్పు ఇస్తాడన్నది ఈ నెల 15న తేలుతుంది.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment