బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సీఎం సిద్దరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గంతోపాటు బాగల్‌కోట్ జిల్లాలోని బాదామీ స్థానంలో సిద్దరామయ్యతో పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. బాదామీ స్థానానికి ఇప్పటికే తమ అభ్యర్థిగా దేవరాజ్ పాటిల్ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. సిద్దరామయ్యకు రెండో సీటు కేటాయించాలా వద్దా అనే దానిపై స్పష్టత లేకపోవడంతో దేవరాజ్‌కు ఇప్పటివరకు బీ–ఫామ్ ఇవ్వలేదు. బాదామీ నుంచీ సిద్దరామయ్య పోటీకి అధిష్టానం పచ్చజెండా ఊపడంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నారని సీఎం కార్యాలయం వెల్లడించింది. చాముండేశ్వరి స్థానానికి సిద్దు ఇప్పటికే నామినేషన్ వేయడం విదితమే.
కర్ణాటకలో పెద్ద నోట్ల వరద
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నగదు కొరత పట్టిపీడిస్తుంటే.. కర్ణాటకలో మాత్రం నోట్ల వరద పారుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఏటీఎంలు క్యాష్ లేక వెలవెలబోతున్నాయి. ప్రజలు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక ఇందుకు మినహాయింపుగా కనిపిస్తోంది. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆ రాష్ట్రంలో పలు చోట్ల సోదాలు చేపట్టగా రూ.4.13 కోట్ల నగదు పట్టుబడింది.
ఇందులో 97 శాతం రూ.2000, రూ.500 నోట్లే ఉన్నాయి. ఈ మేరకు ఐటీ అధికారులు వెల్లడించారు. ‘ఇటీవల కర్ణాటకలో చేపట్టిన సోదాల్లో రూ.4.13 కోట్ల నగదు, రూ.1.32 కోట్ల విలువైన 4.52 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ నగదు మొత్తంలో రూ.2000, రూ.500 నోట్లే రూ.4.03 కోట్లు ఉన్నాయి’ అని ఐటీశాఖ తెలిపింది. మార్చి 27న కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన సోదాల్లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment