సిద్ధరామయ్య మొబైల్ యాప్ (ఫైల్ ఫోటో)
బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి అదృశ్యమైంది. ఈ యాప్ యూజర్లు వ్యక్తిగత డేటాను ఓ ప్రైవేట్ కంపెనీకి విక్రయిస్తుందనే ట్విటర్ యూజర్ల ఆరోపణల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్లే స్టోర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారిక యాప్ కూడా కనిపించడం లేదు. వీటి లింక్‌లను క్లిక్ చేస్తే.. ‘ ప్రస్తుతం ఆ కంటెంట్ మీ దేశంలో అందుబాటులో లేదని, వీలైనంత త్వరగా మీరు ఇష్టపడే కంటెంట్ మరిన్ని దేశాలకు తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. దయచేసి మళ్ళీ చెక్ చేయ్యండి’ అని చూపిస్తోంది.
ఫ్రెంచ్ సెక్యురిటీ రీసెర్చర్ బాప్టిస్ట్ రాబర్ట్ కూడా సీఎం సిద్ధరామయ్య అధికారిక యాప్ యూజర్ల డేటాను ప్రైవేట్ కంపెనీకి అమ్ముతున్నట్టు ధృవీకరించారు. యూజర్ పేరు, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, జెండర్ వంటి వాటిని ప్రైవేట్ కంపెనీకి పంపుతున్నట్టు తెలిపారు. ఆ యాప్ ఓపెన్ చేసిన ప్రతీసారి ఇంటర్నెట్ స్పీడు తగ్గిపోయేదని, సరియైన పరిశీలన చేసుకోలేకపోయేవాడనని తెలిపారు. ఇలా యూజర్ల డేటా ప్రైవేట్ కంపెనీకి చేరుతున్నట్టు ఆయన గుర్తించారు. ఇటీవలే ఫేస్‌బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరి చేసిందనే ఆరోపణల్లో కాంగ్రెస్ పార్టీ ఇరుక్కున సంగతి తెలిసిందే. కేంబ్రిడ్జ్ అనలిటికాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆరోపించారు. మరోవైపు మరికొన్ని రోజుల్లో కర్నాటక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యాప్ అదృశ్య కావడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment