ముందుండి నడిపించండి | KCR Comments about Early Elections with TRS Leaders and activists | Sakshi
Sakshi News home page

ముందుండి నడిపించండి

Published Sat, Sep 8 2018 2:16 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

KCR Comments about Early Elections with TRS Leaders and activists - Sakshi

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): ‘మీ దీవెనలు, ఆశీర్వాదాలతో మళ్లీ నేను గజ్వేల్‌ నుంచే నిలబడుతున్న. మీరందరూ నన్ను ముందుండి నడిపియ్యాలే. నామినేషన్‌ వేసి మీకు అప్పజెప్పుతా. నేను తెలంగాణ మొత్తం తిరగాలె కదా. మీరే రథసారథులు కావాలి. తప్పకుండా అధికారంలోకి వస్తాం. దీంట్లో డౌటే లేదు. నన్ను నల్లగొండకు రమ్మని అక్కడి నాయకులు అన్నరు. కానీ నా మనసొప్పలే. గజ్వేల్‌ను ఇడ్చిపెట్టబుద్ది అయితలేదు. ఇప్పుడు జరిగింది సగం అభివృద్ధే. ఇంకా మస్తు అభివృద్ధి చేసుకోవాలన్న తపనతోనే మళ్లీ పోటీ చేస్తున్నా. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి చూసి గొప్పకు పోవద్దు’అని గజ్వేల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం తన వ్యవసాయక్షేత్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ నవంబర్‌ లేదా డిసెంబర్‌లో దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకూ అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చని, సిద్ధంగా ఉండాలని సూచించారు. 

కంటి వెలుగుకు ఎర్రవల్లి నుంచే పునాది.. 
‘కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఎర్రవల్లి కారణమైంది. గ్రామంలో ముందుగా చూపుసరిగా లేని 250 మందిని గుర్తించి కంటి పరీక్షలు చేయించి అద్దాలు పంపిణీ చేసినం. తర్వాత రాష్ట్రం మొత్తం డాక్టర్లతో సర్వే చేయగా 59 శాతం మందికి చూపు మందగించినట్లు రిపోర్టు వచ్చింది. దీంతో కంటి వెలుగు ప్రారంభించాం. నేనే స్వయంగా రూట్‌మ్యాప్‌ వేసిన. కార్యక్రమం పూర్తి అవ్వడానికి మూడు, నాలుగు నెలలు పడుతుంది. పేదలకు, ముసలోల్లకు చాలా మేలు జరుగుతున్నదని చాలామంది అంటున్నరు’అని కేసీఆర్‌ వివరించారు. 

త్వరలోనే గజ్వేల్‌కు సాగునీరు.. 
వచ్చే ఏడాది జూన్, జూలై వరకు గజ్వేల్‌కు సాగునీరొచ్చేలా పనులు కొనసాగుతున్నాయని కేసీఆర్‌ తెలిపారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు, ఎల్లంపల్లి.. ఇలా అనేక ప్రాజెక్టులు పూర్తి కాగానే సాగునీరుకు ఢోకా ఉండదన్నారు. అన్ని రకాల పంటలు మనమే పండించుకోవచ్చన్నారు. గజ్వేల్‌ ప్రాంతం హైదరాబాద్‌ దగ్గర ఉండటంతో రేపు శాటిలైట్‌ సెంటర్‌ అవుతుందని, గజ్వేల్‌ చుట్టుముట్టు భూములకు డిమాండ్‌ వస్తదని అన్నారు. ఇటీవల గజ్వేల్‌కు రూ.100 కోట్లు కేటాయించాం. వాటితో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చేపట్టాం. మిషన్‌ భగీరథ ద్వారా గజ్వేల్‌కు నీళ్లు వచ్చాయ్‌. త్వరలోనే రాష్ట్రం మొత్తం నీళ్లు వస్తాయ్‌. ఎవరూ ఫికర్‌ పడొద్దు అని చెప్పారు. కరెంట్‌ గండం కూడా తప్పిందని, 24 గంటలు కరెంట్‌ సరఫరా చేశామని వివరించారు. 

గ్రామ ప్రణాళికతో రండి.. 
‘ఇదిప్పుడు చిన్న సమావేశమే. మరొక్కసారి గజ్వేల్‌ నియోజకవర్గంలోని 4, 5 వేల మందితో ఫాంహౌస్‌లోనే సమావేశం అవుదాం. ఇదే నెలలో జరిగే సమావేశానికి కార్యకర్తలు, నాయకులు కలసి గ్రామంలోని సమస్యలకు ప్రణాళిక తయారు చేసుకుని రావాలి. గ్రామ సమస్యలే మేనిఫెస్టోలో ఉంటాయి. ఏ గ్రామంలోని సమస్యలు అక్కడే పరిష్కరించేందుకు ప్రణాళిక తయారు చేసుకుందాం’అని చెప్పారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దానం నాగేందర్, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, గజ్వేల్‌– ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

76 పథకాలు పెట్టాం.. 
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 76 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టుకున్నామని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కేసీఆర్‌ వివరించారు. 50 ఏళ్లలో ఎవరూ చేయని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసుకున్నామని పేర్కొన్నారు. మన పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. రూ.200గా ఉన్న పెన్షన్‌ను వెయ్యికి పెం చిన ఘనత మనదేనన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పింఛన్‌ రూ.2 వేలు ఇస్తామని చెబుతున్నారు.

మనం వెయ్యి ఇవ్వకపోయుంటే కాంగ్రెసోళ్లు మేనిఫెస్టోలో రూ.2 వేలు పెట్టేవారు కాదని చెప్పారు. మళ్లీ అధికారంలోకి రాగానే మనం కూడా మరిన్ని మంచి పథకాలు తీసుకొచ్చుకుందామని చెప్పారు. కొంతమంది చిల్లరగా, పిచ్చోళ్లలా మాట్లాడుతారని, అవన్నీ పట్టించుకునే అవసరం లేదని పేర్కొన్నారు. ‘అసెంబ్లీ రద్దు చేయగానే 105 మందిని ప్రకటించాం. ఇది దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. కాంగ్రెస్‌లో టిక్కెట్లు వస్తాయని తెలిసి కూడా.. 30 మంది కాంగ్రెసోళ్లు టీఆర్‌ఎస్‌లోకి రావడానికి మొగ్గు చూపుతున్నారు. వారిని టీఆర్‌ఎస్‌లోకి తీసుకునే అవసరం లేదు’అని వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement