
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార ప్రణాళిక సిద్ధమవుతోంది. తెలంగాణలో పెద్ద పండుగ దసరా తర్వాత ప్రచారంలో వేగం పెంచాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ముందస్తు ఎన్నికల ప్రచార సరళిపై పలువురు అభ్యర్థులతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ముందుగా అనుకున్న ప్రకారం వంద బహిరంగ సభల నిర్వహణ ఉంటుందని చెప్పారు. మొదట జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలను పూర్తి చేసి ఆ తర్వాత నియోజకవర్గాల స్థాయిలో సభలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బహిరంగ సభల షెడ్యూల్ ప్రకారం పార్టీ ముఖ్య నేతలతో కలసి అభ్యర్థులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
దసరా నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలు సొంత ఊళ్ల ప్రయాణాలు పెట్టుకుంటారని, ఈ సమయంలో బహిరంగ సభల కోసం పార్టీ వినియోగించే వాహనాల వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ భావించారు. అలాగే ముందుగా ప్రచారం నిర్వహించినా... సద్దుల బతుకమ్మ, దసరా పండుగలతో విరామం ఇచ్చినట్లువుతుందని, దీనివల్ల ఊపు తగ్గినట్లుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దసరా తర్వాతే ప్రచార వేగం పెంచాలని నిర్ణయించారు. ఒక్కరోజు కూడా విరామం లేకుండా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహంచాలని అభ్యర్థులను ఆదేశించారు. అభ్యర్థుల మార్పు, ప్రతిపక్షాల అభ్యర్థులెవరనే విషయాలేవీ పట్టించుకోవద్దని సూచించారు.
గ్రామ ప్రగతి నివేదికలు పంచాలి...
టీఆర్‌ఎస్ నాలుగేళ్ల పాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోనే ప్రచారం నిర్వహంచాలని సీఎం కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ప్రచార సామగ్రితోపాటు నియోజకవర్గాల్లో గ్రామాలవారీగా చేసిన అభివృద్ధి పనులను వివరించేలా రూపొందించిన స్థానిక ప్రగతి నివేదిక బ్రోచర్లను ఓటర్లకు పంచాలని చెప్పారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పథకాల లబ్దిదారులను కచ్చితంగా కలిసేలా ప్రచార షెడ్యూల్‌ను రూపొందించుకోవాలని, నగరాలు, పట్టణ నియోజకవర్గాల్లో వార్డులవారీగా చేసిన అభివృద్ధి పనులు వివరించాలని చెప్పారు. ఆయా నగరాలు, పట్టణాలకు టీఆర్‌ఎస్ పాలనలో ఇచ్చిన నిధులు, చేసిన పనులను ఓటర్లకు వివరించేలా బ్రోచర్లను రూపొందించి పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఆ 14 సీట్లకు దసరా తర్వాతే అభ్యర్థులు...
టీఆర్‌ఎస్ ఇంకా 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దసరా తర్వాతే ఈ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనుంది. ఈ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధిష్టానం పలువురు నేతలకు సూచించింది. అయితే అధికారికంగా తమ పేర్లు ప్రకటించిన తర్వాతే ప్రచారం చేయాలనే ఆలోచనతో ఆయా నేతలు ఉన్నారు. మీరే అభ్యర్థులని పలువురు నేతలకు స్పష్టం చేసినా ఈ సెగ్మెంట్లలో ఇంకా ప్రచారం మొదలుకాకపోవడంపై టీఆర్‌ఎస్ అధిష్టానం ఒకింత అసంతృప్తితో ఉంది.
కోటి కుటుంబాలకు లేఖలు...
ప్రజలకు చేరువ కావడానికి టీఆర్‌ఎస్ వినూత్న వ్యూహాన్ని అవలంబించనుంది. నాలుగేళ్లలో ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన కుటుంబాలన్నింటికీ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో స్వయంగా లేఖలు పంపించనున్నారు. ప్రజావసరాలను, ప్రజల బాధలను తెలిసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలని ఆ లేఖలో కేసీఆర్ కోరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 2.5 కోట్ల మంది వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా ఉన్నారని... కుటుంబాల ప్రకారం చూస్తే కోటి ఉంటాయని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలతో ఒక్కో కుటుంబం 4–5 పథకాల లబ్ధిదారులుగా ఉన్నట్లుగా నిర్ధారించింది. సంక్షేమం, అభివద్ధి నినాదంతో ఓటర్ల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించిన టీఆర్‌ఎస్... లబ్ధిదారులకు లేఖలతో మంచి స్పందన ఉంటుందని భావిస్తోంది. అరవై ఏళ్లలో లేని సంక్షేమాన్ని నాలుగేళ్లలోనే అందించామని లేఖల్లో పేర్కనడం ద్వారా ప్రజలను తమవైపునకు తిప్పుకోవచ్చని టీఆర్‌ఎస్ ధీమాతో ఉంది. తెలంగాణలో అన్ని రకాల పింఛనుదారులు సుమారు 45 లక్షల మంది ఉన్నారని, రైతుబంధు పథకంతోనే సుమారు 51 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందిందని టీఆర్‌ఎస్ లెక్కలు వేసింది. రైతులు, రుణమాఫీ, సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల సరఫరా, సబ్సిడీపై ట్రాక్టర్ల పంపిణీ పథకాల లబ్ధిదారులకు లేఖలు రాయనున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment