
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టం–2014 ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని, విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ గురువారం ఆరోపించారు. గత ప్రభుత్వం విభజన హామీలను అమలు చేస్తామంటే ఈ ప్రభుత్వం కాదనడం ఏంటని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లిన తర్వాత అమలు సాధ్యంకాదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలుగు ప్రజలను కేంద్రం మోసం చేస్తుంటే కేసీఆర్ ప్రగతిభవన్‌లో కూర్చుని అదే ప్రపంచం అనుకుంటున్నారని ఎద్దేవా చేశా రు. సీఎం శుక్రవారం ప్రధాని మోదీని కలుస్తున్న నేపథ్యంలో విభజన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో మోదీని అడగాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. ముస్లింలకు కేసీఆర్ ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్లను మోదీతో ఇప్పించాలని కోరారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం ఒక్క శాతం కూడా అమలు చేయనందునే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. మోదీతో కేసీఆర్‌కు ఉన్న రహస్య ఎజెండా ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.