86 సార్లు కలిశాం
* ‘విభజన’ హామీల అమలుపై కేంద్రంతో రాష్ట్రం సంప్రదింపులపై కంభంపాటి
* ఈ విషయాలన్నీ పవన్‌కల్యాణ్‌కు తెలిసి ఉండకపోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చట్టం-2014లో పొందుపరిచిన హామీలు, ఇతరత్రా సమస్యలపై రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో వందలాదిసార్లు సంప్రదింపులు జరిపిందని, ఇందులో 86 సార్లు ప్రత్యక్షంగా వివిధ కేంద్రమంత్రులను కలిశామని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు చెప్పారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్రంతో టీడీపీ ప్రభుత్వం ఎలా సంప్రదింపులు జరిపింది? ఏమేం సాధించిందీ ఏకరువు పెట్టారు. ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తాను బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రగతిని వివరిస్తున్నానని చెప్పినా.. టీడీపీ ఎంపీలు ఏంచేశారంటూ సినీనటుడు పవన్‌కల్యాణ్ చేసిన విమర్శలకు కౌంటర్‌గానే ఈ వివరాలు వెల్లడించినట్టు అవగతమైంది. ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించగా..
ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం అనలేదని, ఇస్తామనే చెబుతోందని, బహుశా బిహార్ ఎన్నికల అనంతరం ఇస్తారేమోనని ఆయన బదులిచ్చారు. టీడీపీ ఎంపీల పనితీరును పవన్‌కల్యాణ్ తప్పుబట్టడాన్ని ప్రస్తావించగా.. ‘అది తప్పుపట్టడమని ఎందుకనుకోవాలి. ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు (ఆయన నోటీసులో ఉండకపోవచ్చు)’ అని కంభంపాటి అన్నారు.