
ఖమ్మంమయూరిసెంటర్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోనే తన పయనమని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి, బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తానని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో అభిమానులు, టీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్ ఎంపీ సీటు కేటాయించకపోవడం పట్ల అభిమానులు ఒకింత ఆవేదనకు గురైనప్పటికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, ఏ ఒక్కరూ అసహనానికి లోనవొద్దని అన్నారు.
పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని పొంగులేటి వారికి సూచించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు పొంగులేటిని ఆలింగనం చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ‘ మీ వెంటే మేముంటాం..’ అంటూ భరోసానివ్వడంతో ఎంపీ పొంగులేటి కూడా ఒకింత భావోద్వాగానికి లోనయ్యారు. పొంగులేటి నామినేషన్ వేయాలని పలువురు నినాదాలు చేయగా..ఆయన సున్నితంగానే తోసిపుచ్చుతూ నిలువరించారు.
పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, బంగారు తెలంగాణ నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల బాటలో పయనిస్తే భవిష్యత్‌లో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తారన్నారు. తనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన, టీఆర్‌ఎస్‌పైనా ప్రగాఢ విశ్వాసముందని, గత నాలుగున్నర సంవత్సరాల్లో అభివృద్ధిపథంలో నడుస్తున్న రాష్ట్రమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఎవరెన్ని అపోహలు సృష్టించినా తాను టీఆర్‌ఎస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సొసైటీ సభ్యులు, వార్డు సభ్యులు, పార్టీ శ్రేణులు, శ్రీనివాసరెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఖమ్మం క్యాంప్ కార్యాలయంలోకి వస్తున్న అభిమానులు, ప్రజాప్రతినిధులు

Comments
Please login to add a commentAdd a comment