సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఎప్పటికప్పుడు వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలతో ప్రజల్లో స్పందన ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. వివిధ మార్గాల్లో దీనిపై సమాచారం సేకరిస్తున్నారు. పలు సర్వే సంస్థలకు ఈ పని అప్పగించారు. అన్ని రకాల సమాచారం అందిన తర్వాత తదుపరి ప్రచార కార్యాచరణ రూపొందించనున్నారు. వరుసగా మూడు రోజులపాటు నిజామాబాద్, నల్లగొండ, వనపర్తిలో బహిరంగ సభలను ముగించిన కేసీఆర్ శనివారం పార్టీ ప్రచార సరళిని సమీక్షించారు. బహిరంగ సభలు జరిగిన ఉమ్మడి జిల్లాల్లోని నేతలతో ఫోన్‌లో మాట్లాడారు.
సభల నిర్వహణతో ప్రచారంపై ఎలాంటి చర్చ జరుగుతోందని ఆరా తీశారు. టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి నేతల అభిప్రాయం ఎలా ఉందని అడిగారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆదివారం వరంగల్‌లో, సోమవారం ఖమ్మంలో బహిరంగ సభలు నిర్వహించాల్సి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్‌లో నెలకొన్న అసమ్మతి కారణంగా వీటిని రద్దు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసమ్మతుల వ్యవహారానికి ముగింపు పలకగానే వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
రెండుమూడు రోజుల్లో ఈ సభల తేదీలను ప్రకటించనున్నారు. వీటిని ప్రకటించేలోపే రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతులకు పూర్తిగా ముగింపు పలకాలని నిర్ణయించారు. అప్పటికీ దారికిరాని వారి విషయంలో కఠినంగా వ్యవహరించనున్నారు. నియోజకవర్గాల వారీగా అసమ్మతి నేతల జాబితాను రూపొందించాలని టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సమాచారం ఆధారంగా ఈ జాబితా ఉండాలని స్పష్టం చేశారు.
పల్లా ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పే పేర్లనే అసమ్మతి జాబితాలో చేర్చుతున్నట్లు పలువురు టీఆర్‌ఎస్ వ్యవస్థాపక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ముఖ్య నేతలు తమతో ఒకసారి మాట్లాడితే పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని వారు అంటున్నారు.
వేగం పెంచాలి...
టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచార సరళిపైనా కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా అభ్యర్థుల ప్రచారతీరుపై సమాచారం సేకరిస్తున్నారు. అనంతరం పలువురు అభ్యర్థులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అనుసరించే ప్రచార వ్యూహంపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, అభివృద్ధి పనులను గ్రామాలవారీగా తెలియజేయాలని సూచిస్తున్నారు.
నియోజకవర్లాల్లో ఎన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారని అభ్యర్థులను అడిగి తెలుసుకుంటున్నారు. అక్టోబర్ 9లోపు నియోజకవర్గ వ్యాప్తంగా తొలిదశ ప్రచారాన్ని పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. తొలిదశ ప్రచారంపై గతంలోనే ఆదేశాలు జారీ చేశామని... నగర, పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోని ప్రచారం ఆశించిన విధంగా సాగడంలేదని పలువురు అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా తొలిదశ ప్రచారం పూర్తి చేయాలని ఆదేశించారు.
రెండో జాబితా సిద్ధం...
పెండింగ్‌లో పెట్టిన 14 స్థానాలకు టీఆర్‌ఎస్ అధిష్టానం ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. ఎంపిక చేసిన అభ్యర్థుల బలాబలాలు, గెలుపు అవకాశాలపై సర్వేలు చేస్తోంది. రెండుమూడు రోజుల్లోనే ఈ జాబితాను సైతం ప్రకటించనుంది. అక్టోబర్ 10న పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment