మరింత బలపడదాం | KCR Speech At Nirmal Public Meeting | Sakshi
Sakshi News home page

మరింత బలపడదాం

Published Mon, Apr 8 2019 1:12 AM | Last Updated on Mon, Apr 8 2019 8:39 AM

KCR Speech At Nirmal Public Meeting - Sakshi

నిర్మల్‌ : ‘యువకులు, విద్యావంతులు సీరియస్‌గా ఆలోచన చేయాలె. మనం ఆర్థికంగా బాగున్నం. మరింత బలపడదం. దేశంలో మనకు అనుకూలమైన గవర్నమెంట్‌ వస్తది. ఇంక రాష్ట్రానికి ఎంత డబ్బు కావల్సి వస్తే అంత తెచ్చుకుందం. వచ్చే పదేళ్లలో రూ. 30 లక్షల కోట్లు ఖర్చు చేస్తం’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని క్రషర్‌ రోడ్డులో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ జరిగింది. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు నిర్మల్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ 35 నిమిషాలపాటు సభలో ప్రసంగించారు. రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాజ్యసభ ఎంపీలు కె. కేశవరావు, సంతోష్‌రావు, ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్‌పర్సన్, నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

కరెంటు బాధలు పోయాయి...
చాలా కష్టపడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నం. రాష్ట్రమొస్తే ఏం లాభం జరుగుతుందో కండ్ల ముందు కనబడుతోంది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు బాధలు పోయాయి. ఇక మున్ముందు కూడా రావు. ఇండియన్‌ ఎలక్ట్రికల్‌ అథారిటీ లెక్కల ప్రకారం తలసరి విద్యుత్‌ వాడకంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. ఏ రాష్ట్రం కూడా 24 గంటలపాటు రైతాంగానికి ఉచితంగా కరెంటు ఇవ్వట్లేదు. రాత్రిపూట పాములు, తేళ్ల మధ్య పొలానికి పోయే అవసరం లేకుండా కరెంటు షాకుల కష్టం పోయేలా చేశాం. గతంలో రూ. 200 ఉన్న పింఛన్‌ను రూ. వెయ్యికి పెంచాం. మే నెల నుంచి రూ. 2 వేల చొప్పున ఇస్తాం. దేశంలోని 18 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలోనూ వారికి పింఛన్లు ఇవ్వట్లేదు. పీఎఫ్‌ ఉన్నోళ్లందరికీ పింఛన్‌ ఇస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. గతేడాది ఎకరాకు రూ. 8 వేల చొప్పున ఇచ్చాం. ఇక నుంచి ఏటా రూ. 10 వేల చొప్పున అందిస్తాం. రైతులు ఏ కారణంతో మరణించినా రైతు బీమా ద్వారా రూ. 5 లక్షలు బాధిత కుటుంబానికి పది రోజుల్లోనే అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. నాణ్యమైన చదువులు, సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం, 24 గంటల కరెంటు, పింఛన్లు.. ఇలా ఇవన్నీ కండ్ల ముందే ఉన్నాయి.

పాలనా సంస్కరణలు చేసుకున్నం..
ఆంధ్రప్రదేశ్‌లో కలసి ఉండే కంటే తెలంగాణలో లాభపడతామని నమ్మినం. స్వరాష్ట్రంలో ఎన్నో పరిపాలనా సంస్కరణలను చేసుకున్నం. ఇదే ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన అప్పటి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపీ నగేశ్‌ తమ జిల్లాలో బెజ్జూరు నుంచి ఆదిలాబాద్, బాసర నుంచి ఆదిలాబాద్‌కు పోవాలంటే కష్టమవుతుందని చెప్పారు. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజల కష్టాలు తీర్చేతందుకు నాలుగు జిల్లాలుగా చేసినం. తెలంగాణ ఏర్పడకుంటే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాకుంటే జిందగీలా నిర్మల్‌ జిల్లా కాకుండే. దేశానికి కశ్మీర్‌ ఎలాగో తెలంగాణకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అలాంటిది. ఎస్సారెస్పీ ద్వారా నిర్మల్, ముథోల్‌ నియోజకవర్గాలకు లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. తుమ్మడిహెట్టి ప్రాజెక్టు కూడా చేపట్టినం. ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్‌ను కశ్మీర్‌లా కళకళలాడేలా చేస్తా. అది నా బాధ్యత.

దేశమే ఆశ్చర్యపోయేలా..
మంచిర్యాల రైతు ఫేస్‌బుక్‌లో వీడియో పెడితే నేను పరిష్కరించా. ఆల్తూ..ఫాల్తూ ముచ్చట్లు చెప్పుడు ఇష్టం లేదు. భారతదేశమే ఆశ్చర్యపోయేలా జూన్‌ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం తెస్తం. ఒక్కో గుంట లెక్క తేలాలె. వ్యవసాయ భూముల సమస్యలన్నీ పరిష్కారం కావాలె. ప్లేన్‌ ఏరియాలోనూ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. భూమి యజమానికి సంపూర్ణ అధికారం కల్పిస్తం. పహాణీ లెక్కలు మార్చినం. దోపిడీ శక్తులు రైతులను దోచుకుతింటున్నయని సమూల మార్పులు చేస్తున్నం. ఇగ భూ సమస్యలు లేకుండా, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, లంచాలు ఇవ్వకుండా కొత్త చట్టం తీసుకువస్తున్నం. దేశమే మన దగ్గర నేర్చుకునేలా చట్టం తెస్తం. బర్రున రాను.. బుర్రున పోను. భూముల సమస్యల పరిష్కారానికి ఒక్కో జిల్లాలో ఒకటిరెండు రోజులు ఉంట. సీఎస్‌ కాడికెళ్లి అధికారులంతా.. మంత్రివర్గమంతా కలిసి క్యాంపు పెడతం. భూ సంబంధిత పనులకు లంచం ఇచ్చే అవసరం లేకుండా చేస్తం. లోనుకు పాసుబుక్కు అవసరం లేకుండా, గంట లోపే మ్యుటేషన్‌ చేసేలా కొత్త చట్టం వస్తది. రైతులు నెల రోజులు ఓపిక పట్టండి. అప్పటి దాకా భూ సంబంధిత పనులు చేయించుకోవద్దని సూచిస్తున్న.

పసుపు బోర్డు ఏర్పాటును మోదీ పట్టించుకోలేదు...
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి. కానీ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) నిర్ణయాన్ని కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంది. ధరలు రాష్ట్రం చేతిలో లేవు. నిర్మల్‌ జిల్లాలో పసుపు పండించే రైతులు ఉన్నారు. వారి కష్టాలు కూడా నాకు తెలుసు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని స్వయంగా నేను ప్రధాని మోదీకి చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ జాతీయ నాయకులు తమకు ఓటేస్తే మూడు నెలల్లో పసుపు బోర్డు ఇస్తామని సిగ్గులేకుండా చెబుతున్నారు. మరి ఐదేళ్లపాటు వాళ్లు ఏం చేశారు?

కులాల చిచ్చు ఉన్నంత వరకు..
మన హిమాలయాలకు అటువైపు ఉన్న చైనా జీడీపీ 1976కు ముందు మనకంటే తక్కువ. ఇప్పుడు నాలుగు రెట్లు అధికంగా ఉంది. చైనాలాగానే భారత్‌లోనూ 130 కోట్ల జనాభా ఉన్నారు. ఎప్పుడైనా బలమైన ప్రధాని వస్తే తమ దేశానికి ఏయే రంగాల్లో ఇబ్బంది ఏర్పడుతుందో.. తెలుసుకోవాలని ఒక ఏడాది సమయమిస్తూ ఓ సర్వే బృందాన్ని చైనా మన దేశానికి పంపించింది. ఆ బృందం సభ్యులు మూడునెలల్లోనే తిరిగి చైనాకు వెళ్లి ఎప్పటికీ భారత్‌ మనకు పోటీ రాదు. అక్కడ ఇప్పటికీ కులాలు, మతాల కొట్లాటల్లోనే ఉన్నారని నివేదిక ఇచ్చారు. ఎప్పుడైతే ఈ కులాల కుళ్లు, మతాల చిచ్చు పోతుందో అప్పుడే మన దేశం బాగుపడుతుంది. ఈ దేశంలో 3.5 లక్షల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంటే కనీసం 2లక్షల మెగావాట్ల కరెంటు కూడా వాడలేని దుస్థితి ఉంది.

కేంద్రంలో అనుకూల గవర్నమెంట్‌...
దేశం కూడా కచ్చితంగా బాగుపడాలె. దేశవ్యాప్తంగా గుణాత్మకంగా మార్పురావాలె. ఇందుకోసమే నేను ఢిల్లీలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటును ప్రతిపాదించా. లౌకిక భావాలుగల ముఖ్యమంత్రులు, పార్టీలను కలిశా. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలిపిస్తే దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకువస్తా. దేశంలో అనుకూల గవర్నమెంట్‌ రానుంది. రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు తెచ్చుకుంటాం. దేశ ఎజెండా సెట్‌ చేయాల్సిన సమయం వచ్చింది. ఆదిలాబాద్‌ లోక్‌సభ ఓటర్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోడం నగేశ్‌ను 3 లక్షల భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా. జై తెలంగాణ.. కారు గుర్తుకే మన ఓటు. సీఎం సభానంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు.

బీజేపీ నేతలను ప్రజలు తొక్కాలి...
తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలను ఈ ఎన్నికల్లో ఓటర్లు తొక్కాలి. గత ఎన్నికల్లో చెప్పిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇంటికి రూ. 15 లక్షల చొప్పున ఇస్తామన్న బీజేపీ వాళ్లు ఎందుకు బ్యాంకు ఖాతాల్లో వేయలేదు. ఎలక్షన్‌ రాగానే పాకిస్తాన్, హిందువులు, ముస్లింలు బీజేపీకి గుర్తుకు వస్తారు. ఒక దేశ ప్రధాని హిందూ, ముస్లింలు అంటూ విభజించి మాట్లాడొచ్చా? మనకేం బీమారైందా? ఎవరికి వారం కలసిమెలసి లేమా? ఈ లంగా పంచాయతీలు ఎందుకు? ఏ మతమైనా అందరి రక్తం ఒక్కటి కాదా ? ఏ మతమైనా గిచ్చితే నొవ్వదా? నిర్మల్‌లో దేవాలయాలన్నీ బీజేపీ నేతలే కట్టించారా? బీజేపీ నాయకులు సమాజాన్ని విభజించి, పంచాయతీలు పెట్టి కలుషితం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో మరింతగా ప్రచారం చేస్తున్నారు. కుల, మతాల పంచాయితీ పోతేనే దేశం బాగుపడ్తది. కులం, మతం, లింగబేధం.. మన దేశానికి దరిద్రం. భారతీయులందరూ పిడికిలి బిగిస్తేనే దేశం బాగుపడుతుంది. గిరిజనులు, దళితులకు గౌరవం లభిస్తేనే, అన్ని రంగాల్లో మహిళల పాత్ర పెరిగితేనే దేశం పురోగమిస్తుంది.

చిల్లరమల్లర ప్రధానిని ఎప్పుడూ చూడలె...
ఇంత అధ్వానమైన, చిల్లరమల్లర ప్రధానమంత్రిని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రజల మౌలిక సమస్యలను ప్రధాని ఏనాడూ పట్టించుకోలేదు. మోదీకి దేశాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి గురించి, ప్రజల సమస్యల పరిష్కారం గురించి ఒక నిర్దిష్టమైన పాలసీ లేదు. దేశ ప్రజల సమస్యలను వదిలేసి కేసీఆర్‌ ముక్కు పెద్దగున్నది.. ఆయన జ్యోతిష్యాన్ని నమ్ముతారు అంటూ ఓ ప్రధాని ప్రచారం చేయడం విడ్డూరం. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి సీఎంలపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం శోచనీయం. నేనేం పూజలు చేస్తే ఆయనకేం? నా డబ్బులతోనే చేస్తున్నా కదా? నువ్వొస్తే నీకు కూడా తీర్థం, ప్రసాదం పెడతా. మోదీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏదీ సక్కగ లేదు. 7,500 కి.మీ. సముద్రతీరం, ఎన్నో దీవులు ఉన్నా పట్టించుకోలేదు. సింగపూర్‌లో ఏమున్నది.. మన్నున్నదా? మన దేశంలోనే సహజసిద్ధమైన టూరిజం ప్లేసులు ఎన్నో ఉన్నాయి. అభివృద్ధి చేయకపోవడం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల అసమర్థత.

బతికుంటే నేనే చేస్తనని చెప్పిన...
మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. ఈ సంవత్సరం నుంచి పదేళ్లలో రూ. 30 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నం. ఇది కేంద్ర బడ్జెట్‌ కంటే మూడు రెట్లు ఎక్కువ. తెలంగాణ ఏర్పడితేనే సమస్యలన్నీ దూరమైతాయని 1996లోనే చెప్పా. అప్పట్లో నేను ఎస్సారెస్పీకి వచ్చినప్పుడు ఇక్కడి నాయకుడు కడ్తాల్‌ సత్యనారాయణగౌడ్‌ మరికొందరం కలసి డ్యామ్‌పై నడుచుకుంటూ ఉద్యమం గురించి మాట్లాడుకున్నాం. నేను బతికుంటే ఉద్యమం చేస్తానని అప్పుడే చెప్పా. 2001లో జెండా పట్టుకుంటే ఎవరూ రాలేదు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి చేరడంతో ఉద్యమం బలపడింది. అప్పట్లో తెలంగాణ వస్తదంటే ఎవరూ నమ్మలేదు. స్వరాష్ట్రం సాధించుకోవడం వల్ల పేదలకు, వృద్ధులకు, ఒంటరి, వితంతు, దివ్యాంగులకు పింఛన్లను ఇచ్చి కడుపు నింపుతున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement