‘‘నీకు డబ్బా కొట్టే ఒకటి, రెండు వార్తాసంస్థలను అడ్డం పెట్టుకొని ఏదైనా చేస్తా అనే చంద్రబాబు నాయుడూ మాతోని గెలుకున్నవ్ జాగ్రత్త. తెలంగాణ దెబ్బేందో ఒకసారి తలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డవ్.’’ ‘‘మా బతుకు మేము బతుకుతున్నం. మేము నీ తెరువు రాలే. ఇవ్వాల ఈడ దుకాణం పెడతానంటున్నావ్. బిడ్డా.. నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. ’’
నల్లగొండ, సాక్షి ప్రతినిధి : ‘‘ఏమన్న చేయాలె.. టీఆర్‌ఎస్‌ను ఓడగొట్టాలె. ఎన్ని అబద్ధాలైనా చెప్పాలని కుట్రలు పన్నుతున్నరు. కుట్రల్లో కొత్త కుట్ర.. సిగ్గు, శరం, పౌరుషం లేకుండా హీనాతి హీనంగా చంద్రబాబును తోలుకొస్తుండ్రు. ఆమోదిస్తదా తెలంగాణ? చిల్లర రాజకీయం కోసం నీచాతినీచంగా దిగజారి చంద్రబాబును తొలుకొచ్చి ఆయనకున్న హాఫ్ పర్సెంటో, జీరో పర్సెంటో ఓట్లుంటే దాంతోని గండం గట్టెక్కాలని కాంగ్రెస్ నేతలు చూస్తుండ్రు. సిగ్గు కూడా లేదు. చంద్రబాబు నిన్న విజయవాడలో ఒక మాట మాట్లాడిండు. అదో తమాషా. తెలుగోళ్లం ఒక్కటి అని కేసీఆర్‌కు చెప్పిన.. ఇద్దరం ఒక్కటైతే ఢిల్లీలో ఫలితం ఉంటదని చెప్పిన.. నా వెంట కేసీఆర్ రాలేదు. అందుకే మహాకూటమి వెంట వచ్చినన్నడు.
అది మహాకూటమా? కాలకూట విషమా? మహాకూటమా? మన తెలంగాణను నాశనం చేసే గూటమా? మహాకూటమా? నీ బొంద కూటమా?’’అని టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కె. చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. గురువారం నల్లగొండలో నిర్వహించిన ఆశీర్వాద సభలో మహాకూటమి, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, వేముల వీరేశం, రవీంద్ర నాయక్, భాస్కర్‌రావు, నోముల నర్సింహయ్య, నేతలు చాడ కిషన్‌రెడ్డి, ఉమామాధవరెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, విజయసింహారెడ్డి పాల్గొన్నారు. సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే...
నాలుగేళ్లు మోదీ సంక నాకింది నువ్వు కాదా?
‘‘నరేంద్ర మోదీ, కేసీఆర్ ఒక్కటై పోయిండ్రని చంద్రబాబు అన్నడు. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడినందుకు. నాలుగేళ్లు మంచిగా మోదీ సంక నాకితివి కదా? మోదీ కాళ్లు మొక్కి నా ఏడు మండలాలు గుంజుకున్నవు. మోదీని అడ్డం పెట్టుకొని నా సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నవు. మోదీని అడ్డం పెట్టుకొని నా హైకోర్టు విభవజన కానివ్వలే. ఇవి వాస్తవాలు, నిజాలు కావా? నీ నంగనాచి మాటలు.. నీకు డబ్బా కొట్టే ఒకటి, రెండు వార్తాసంస్థలను అడ్డం పెట్టుకొని ఏదైనా చేస్తా అనే చంద్రబాబు నాయుడు మాతోని గెలుక్కున్నవ్ జాగ్రత్త. తెలంగాణ దెబ్బేందో ఒకసారి తలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డవ్.
నిన్ను చూసి బర్లు పలుపు తెంచుకుంటయ్..
మా బతుకు మేము బతుకుతున్నం. మేము నీ తెరువు రాలే. మాకు 119 ఉంటే నీకు 175 నియోజక వర్గాలున్నాయి. ఆడ సక్కగా లేదు నీ కథ. ఆగ మాగంగా ఉంది. ఇవ్వాల ఈడ దుకాణం పెడతానంటున్నావ్. బిడ్డా.. నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. తెలుగువాళ్లం ఒక్కటిగా ఉందామంటున్నావ్.. తెలుగు పేరు చెప్పి మా కొంప ఆర్పావ్. చంద్రబాబు పేరు చెబితే తెలంగాణలో దొడ్ల కట్టేసిన బర్లు కూడా పలుపు తెంచుకొని పారిపోతయ్. అంత దుర్మార్గమైన కాలు నీది.
ఇక్కడ దరఖాస్తు పెట్టుకుంటే అమరావతికి పోవాలా?
నువ్వు తెలంగాణకు కావాలా? నువ్వు పెట్టిన బాధలు.. బూటకపు ఎన్‌కౌంటర్ల మీద నువ్వు కాల్చి చంపిన వేలాది మంది పిల్లల ఆత్మలు ఘోషిస్తున్నాయి. అలాంటి తెలుగుదేశం పార్టీతో నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటున్నరు. తెలంగాణ కోసం నేను ఎవ్వనికీ రాజీ పడలే. ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనక్కు పోలే. నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్‌లో డాక్టర్లు నువ్వు కోమాలోకి పోతవ్.. చచ్చిపోతవ్ కేసీఆర్, మా మాట విను కేసీఆర్ అన్నరు. నేను వినలే. చావు నోట్లో తలకాయ పెట్టి సాధించిన తెలంగాణను మల్ల తీసుకుపోయి విజయవాడకు అప్పజెప్పుతరా? చైతన్యవంతమైన నల్లగొండ జిల్లా తీర్పు చెప్పాలి. రేపు దరఖాస్తు పట్టుకొని మనం అమరావతికి పోవాలా? హైదరాబాద్‌కు పోవాలా? దీన్ని తిప్పికొట్టాలి. 58 ఏళ్ల పీడ ఎన్నో పోరాటాలు చేసి వదిలించుకుంటే మళ్లీ దుర్మార్గులు పౌరుషం లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నరు. మనం అమరావతి గులాంగా ఉండాలా? అధికారంలోకి వచ్చి చంద్రబాబు 15 ఎమ్మెల్యేలను గెలిస్తే మన డిండి ప్రాజెక్టు ముందల పడనిస్తడా? మన సాగర్ నీళ్లు రానిస్తడా.. మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనిస్తడా? మీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారా? ఇంతకన్నా ఇంకోటి ఉందా? దయచేసి తెలంగాణ ప్రజానీకం ఆలోచించాలి.
అభివృద్ధిపై కాంగ్రెస్‌కు కళ్ల మంట..
యాదాద్రి జిల్లాకు కాళేశ్వరం కాలువ ద్వారా గంధమల్ల, బస్వాపూర్ ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరు రావాలి. డిండితో దేవరకొండ, మునుగోడు సస్యశ్యామలం కావాలి. ఎస్సారెస్పీతో తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట మొత్తం పచ్చబడాలే. కృష్ణాలో మన వాటా తీసుకొని నాగార్జున సాగర్ ఆయకట్టులో గుంట పోకుండా కాపాడు కోవాలి. రైతులు బాగు పడేలా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రైతు బంధు పథకం కొనసాగిస్తాం. ఎకరానికి రూ. 8 వేలు ఇస్తున్నం. గతంలో ఎవరూ పట్టించుకోలేదు. రైతులకు రైతు బీమా చేశాం. అభివృద్ధిని చూసి కళ్లమంట పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు... కేవలం మళ్లీ అధికారంలో రావడానికి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. నల్లగొండ ప్రజలు అన్ని రకాలుగా చైతన్యవంతులు. ఆడపిల్లలు బతుకమ్మ వస్తే పండుగ చేసుకుంటారు. గౌరవించి 90 లక్షల చీరలు పంచేందుకు తయారు చేయించాం. భువనగిరికి చెందిన గూడూరు నారాయణరెడ్డి చీరలు పంచవద్దని కోర్టుకు పోయాడు. ఆడపిల్లల నోటి కాడ కూడు గుంజేసి చీరలు పంచొద్దని చెప్పారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉండి చీరలు పంచకపోయినా ఎన్నికల కోడ్ ఎత్తిన తెల్లారే మీ కాళ్ల దగరికే చీరలు తెచ్చి మీ ఊళ్లో మీ చెతుల పెడతాం.
రైతు బంధు చెక్కులు పంపిణీ చేస్తాం..
రైతు బంధు చెక్కులు ఇవ్వవద్దని మర్రి శశిధర్‌రెడ్డి కోర్టుకు పోతే.. కోర్టు రెండు చెంపలు వాయించింది. హైకోర్టు ఆర్డర్‌తో రేపటి నుంచి గ్రామాల్లో చెక్కుల పంపిణీ చేయిస్తున్నాం. తెలంగాణ మల్ల ఆగం కావద్దు. తెలంగాణ ప్రగతి రథచక్రం ఆగవద్దు. ఉరికెటోని కాళ్లల్ల కట్టె పెట్టే ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలి. రాజకీయ సుస్థిరత దెబ్బ తినొద్దు. దాసిదాసి దయ్యాల పాలు చేయవద్దు. ఆశాంతి రావద్దు. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి కావద్దు. మోసపోతే గోస పడతాం. చైతన్యం ఉన్న జిల్లా నల్లగొండ ముందుకు పోవాలి. 12 నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండా ఎగురుతుంది. పన్నెండుకు పన్నెండు గెలుస్తామని సర్వేలు తెలియజేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ వాళ్ల గోసీలు ఊడిపోయే పరిస్థితి ఉంది. ఫలితాలు మీరు చూడబోతారు. నిన్ననే ఒక కొత్త సర్వే రిపోర్టు వచ్చింది. రాష్ట్రంలో 7 సీట్లు మజ్లిస్‌కు పోతే 112 నియోజకవర్గాల్లో 110 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని సర్వే రిపోర్టు వచ్చింది. దీంట్లో నల్లగొండలో 12కు 12 గెలుస్తమని వచ్చింది. నల్లగొండ ప్రజలు మిగతా తెలంగాణకు మార్గదర్శకం కావాలి. సాగు నీళ్లు రావాలన్నా.. అన్ని రకాలుగా మనం బాగుపడాలన్నా ఈ ప్రగతి రథచక్రం ఆగొద్దన్నా.. ముందుకు తీసుకుపోవాలి. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాగానే కుట్ర మొదలు పెట్టిండు. అస్థిర పరచాలి. గడబిడ చేయాలని కుట్రలు పూనిండు. ఓటుకు నోటుతో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిండు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నాకు ఫోన్ చేసి ప్రభుత్వం పడగొట్టేందుకు కుట్ర చేస్తుండ్రు అని చెప్పాడు. కుట్రలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిండు. బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, కోనప్ప, వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ముగ్గురు మనతో కలిశారు. దాంతో మన సంఖ్య 75 అయింది. ఆ తర్వాత కుట్రలు బంద్ అయ్యాయి. అలాంటి కుట్రదారుడిని తీసుకొచ్చి వీళ్లు (కాంగ్రెస్) ఊరేగుదామనుకుంటున్నారు. నల్లగొండ చరిత్రలో ఇది కనీవినీ ఎరుగని సభ. నేను అనుకున్న దానికన్నా గొప్పగా సభను విజయవంతం చేశారు.’’
బొడ్ల కత్తి పెట్టుకొని చంద్రబాబు తిరుగుతుండు..
చంద్రబాబు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలను ఒక్కటి చేస్తానంటడు. ఇంకో డేమో రెండు జర్మనీలు ఒక్కటైనట్లు బెర్లిన్ గోడ కూలగొట్టినట్లు మళ్లీ ఒక్కటి చేస్తం అని మాట్లాడతడు. చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ వ్యక్తి కాదు... నయవంచకుడు, ద్రోహి. బొడ్ల కత్తి పెట్టుకొని తిరుగుతుండు. మౌఖా దొరికితే మనను పొడిచి పారేస్తడు. మల్ల తెలంగాణ వాళ్లు బానిసలు అవుతరు. తెలంగాణ మేధావులు అందరూ ఆలోచన చేసి ఈ కుట్రను తిప్పి కొట్టాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలి. 19 ఏళ్ల నుంచి నేను తండ్లాడుతున్నా. 1999 నుంచి ఈ రోజు వరకు 19 సంవత్సరాలు. ఆ నాడు ఉద్యమమైనా అట్లనే తీసుకున్నా. చాలా సందర్భాల్లో చెప్పిన. రాజకీయం అంటే ఇతరుల పాలిటిక్స్‌లో గేమ్.. మాకు గేమ్ కాదు. మాకు ఒక టాస్క్. మాకు ఒక మిషన్. అనుకున్న తెలంగాణ కావాలి. కోటి ఎకరాలు పచ్చని తెలంగాణ చేయాలి అనుకున్నాం.
Comments
Please login to add a commentAdd a comment