బుడ్డర్‌ఖాన్లలాగా కత్తులు తిప్పిన్రు | KCR Speech At Wanaparthy Public Meeting | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 6 2018 1:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

KCR Speech At Wanaparthy Public Meeting - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : ‘‘నల్లగొండ, పాలమూరు సభల వద్ద పల్లీలు, బఠాణీలు అమ్ముకోవడానికి వచ్చిన జనం అంత లేరు అలంపూర్‌లో నిన్న కాంగ్రెస్‌ మీటింగ్‌ వద్ద. కానీ వాళ్లు ఏం మాట్లాడారు? కేసీఆర్‌ బట్టేబాజ్, ధోఖేబాజ్‌ అంటూ ఒక పీసీసీ అధ్యక్షుడు .. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడాడు. ఇది సంస్కారమా? బుడ్డర్‌ఖాన్‌లు కత్తి తిప్పినట్లు గద్వాల స్టేజ్‌ మీద జానారెడ్డి, మిగిలిన వాళ్లు కత్తులు తిప్పినరు. కత్తులు తిప్పవలసిన కాడ తిప్ప లే. తిప్పకూడని కాడ తిప్పిండ్రు. మున్ముందు చెప్త వాళ్ల సంగతి’’అంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలపై టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేం ద్రానికి సమీపంలోని నాగవరంలో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్‌ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కె. దామోదర్‌రెడ్డి, పి. నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి, ఎస్‌. రాజేందర్‌రెడ్డి, అంజయ్య యాద వ్, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజ్, జైపాల్‌ యాదవ్, అబ్రహం, ఎడ్మ కిష్టారెడ్డి, మందా జగన్నాథం, పి. రాములు, జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే... 

సమస్యలన్నీ పరిష్కరించుకున్నాం... 
పది జిల్లాల ప్రజలు ప్రభంజనమై ఉద్యమిస్తే భారతదేశ రాజకీయ వ్యవస్థ తెలంగాణ అవసరాన్ని గుర్తించి రాష్ట్రం ఇచ్చింది. ఆనాడున్న పరిస్థితుల్లో నిర్ణయం తీసుకొని ఒంటరిగా బరిలోకి దిగినం. ప్రజలు అధికారం ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది. సంక్షేమం, సాగునీటి రంగం కావొచ్చు.. మంచినీటి రంగం కావొచ్చు.. కరెంట్‌ రంగం కావొచ్చు.. దయచేసి ఆలోచన చేయాలని మనవి చేస్తున్న. ఎన్నికల సభలు జరుగుతయి.. చాలా మంది వచ్చి చాలా మాట్లాడుతరు. కానీ ప్రజలు ఆలోచన చేయాలి. కేసీఆర్‌ చెప్పిన మాట విని ఉట్టిగనే పోవొద్దు. తప్పక చర్చ పెట్టాలి. ఏది నిజం అని ప్రత్యేకించి పాలమూరుపై చేయాలి. తెలంగాణ వచ్చిన నాడు భయంకరమైన సమస్యల వలయం. కొత్త రాష్ట్రం, అరకొర అధికారులు, డబ్బు, బడ్జెట్‌ ఏంటో తెలియదు. శిథిలమైపోయిన చెరువులు, పెం డింగ్‌ ప్రాజెక్టుల, కరువు కాటకాలు, మంచినీళ్ల గోసలు, ఆకలిచావులు–ఆత్మహత్యలు... ఇదీ 2014 లో సమైక్య పాలకులు మనకు అప్పగించిన తెలంగా ణ. అతి ముఖ్యమైన అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన కరెంట్‌ సమస్యను పరిష్కారం చేసుకున్నాం. ఒకటి ఒకటి చొప్పున సమస్యలన్నీ పరిష్కరించుకున్నాం. ఈ రోజు ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, వి ద్యార్థులకు సన్నబియ్యం, కేసీఆర్‌ కిట్లు, కంటివెలుగు కావొచ్చు రకరకాల సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేసుకుంటున్నాము. 

కాంగ్రెస్‌ గొర్రెలకు తెలువలే... 
మత్స్యకారులు, గొల్లకుర్మలకు చేప పిల్లలు, గొర్రె పిల్లలు ఇస్తమంటే కాంగ్రెస్‌ నాయకులు అసెంబ్లీలో అవహేళన చేశారు. యాదవులు, గంగపుత్రులు ప్రతిపక్షాల నేతల కంటికి కనిపించలె. వారిని ఆగం పట్టించిండ్రు. గొర్రెలు అంటే ఈ కాంగ్రెస్‌ గొర్రెలకు తెలియలే. మన రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌ నగరంలో రోజుకు 12 వేల గొర్రెలు ఖర్చయితయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినప్పుడు రోజూ 650 గొర్రెల లారీలు రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి వస్తున్నయి. ఏం.. మన రాష్ట్రంలో ఎందుకు ఉత్పత్తి చేయలేకపోయారు? రూ. 4 వేల కోట్లతో 65 లక్షల గొర్రెలను యాదవ సోదరులకు పంపిణీ చేశాము. ఈ రోజు మరో 35 లక్షల గొర్రెలు పుట్టినయి. ఈరో జు యాదవ సోదరులు రూ. 1,500 కోట్ల సంపద సంపాదించారు. రాబోయే కొద్ది రోజుల్లో బలమైన, ధనవంతులైన గొల్లకుర్మలు ఎక్కడన్న ఉన్నారా అంటే భారతదేశం మొత్తంలో తెలంగాణలోనే ఉంట రు. చేపలు పట్టే బెస్త, గంగపుత్రులు, ముదిరాజ్‌లు రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నరు. చాలా సందర్భాల్లో శ్రీశైలం వంటి ప్రాజెక్టుల్లో చేపలు పట్టడానికి వెళ్తే ఆంధ్రోళ్లు తరిమికొట్టారు. ఆ దుస్థితి పోవాలని చేపల పెంపకం కోసం రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి చేపల పెంపకాన్ని ప్రొత్సహించినము. అద్భుతమైన ఫలితాలు వస్తున్నయి. రూ. వందల కోట్లలో పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. చేనేత కార్మికుల ఆత్మ హత్యలు ఆగిపోయాయి. నాయీబ్రాహ్మణుల షాపులకు సబ్బిడీ ధరలకే కరెంటు సరఫరా చేస్తున్నాం. రజక సోదరుల కోసం నూతన విధానాలను అవలంభిస్తున్నాము. వ్యవసాయం సంక్షోభంలో ఉంటే రూ. 17 వేల కోట్ల రుణాలను మాఫీ చేసుకున్నాం. 

పిక్చర్‌ వేసి చెబుతా అంటే పారిపోయారు 
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు పూడ్చలేని మోసం జరిగింది. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందాలె. ఇందుకోసం దాదాపు 40 మంది పదవీవిరమణ పొందిన చీఫ్‌ ఇంజనీర్లను నాలుగు హెలికాప్టర్లు పెట్టి కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులతోపాటు మిగతా ఉపనదుల మీద 14 రోజులు తిప్పిన. వాళ్లు తిరిగి నాకు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత.. వ్యాప్కోప్‌ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఇచ్చి మొత్తం డిజైన్లు తయారు చేసిన. ఆ విషయాన్ని ప్రజానీకానికి తెలియడం కోసం శాసనసభలో పిక్చర్‌ వేసి చెబుతా అంటే కాంగ్రెస్‌ నేతలు వెన్నుచూపి పారిపోయారు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎందుకు పారిపోయింది. ముఖం లేకనా.. తెలివిలేకనా... అవగాహన లేకనా. బండారం బయటపడుతుందనా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పి మాట్లాడాలె. శాసనసభలో తోకముడుచుకొని పోయారు. కాంగ్రెస్‌ నేతలకు నాలెడ్జ్‌ లేదు. ఎందుకంటే ఆంధ్ర పాలకులకు సంచులు మోసి బతికినారు తప్పితే వీళ్లకు సొంత తెలివి లేదు. శాసనసభ సమావేశాలు పెట్టిన ప్రతిసారీ పారిపోయారు. ఏదో ఒకసారి దొరికినారు. చర్చపై మాట్లాడమంటే లేదు లేదు ప్రిపేర్‌ కాలేదంటడు! పీకనికి వచ్చినారా ప్రిపేర్‌ కాకపోతే. అడ్డగోలు మాటలు తప్పితే ఏది ఎక్కడుందో తెలియదు. 

వ్యాసాలు, హారతులు పడతరా? 
పాలమూరును వలస జిల్లా చేసి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రకు 64 వేల క్యూసెక్కులు తీసుకెళ్తుంటే ఇదే జిల్లాకు చెందిన చిన్నారెడ్డి పత్రికల్లో వ్యాసాలు రాసిండు సిగ్గు లేకుండ. చిల్లర మంత్రి పదవి కోసం నష్టం లేదంటూ వ్యాసాలు రాసిన చిన్నారెడ్డి సిగ్గు లేకుండా వ్యవహరించిండు. అలాగే కృష్ణా బేసిన్‌లో లేకపోయినా మరో జిల్లా అనంతపురానికి సుజల స్రవంతి ద్వారా నీళ్లు తీసుకెళ్తుంటే జిల్లాకు చెందిన డీకే అరుణ గద్వాలలో కత్తి తిప్పినామే.. అనంతపురంలో రఘువీరారెడ్డి ముందు మంగళహారతి తిప్పింది. వాటన్నింటినీ ప్రతి ఇంటికీ చూపిస్తాం. డీకే అరుణ.. కాస్కొండి అంటూ మాట్లాడుతోంది. డీకే అరుణా.. నీవు కాసుకో.. మీ బతుకంతా అందరికీ తెలియజేస్తాం. పోతిరెడ్డిపాడుకు పొక్కపెడితే ఇదే సమస్య మీద టీఆర్‌ఎస్‌ మంత్రులు రాజీనామా చేసి బయటకొచ్చినం. టీఆర్‌ఎస్‌ మంత్రులు పదవులను విసిరేస్తే.. ఇదే జిల్లాకు చెందిన దరిద్రులు నోరు మూసినారు. ఉమ్మడి పాలమూరు ప్రజలు నిర్ణయం చేయాలి. పాలమూరులో కుర్చీ వేసుకొని ప్రాజెక్టులు కడతామని చెప్పినము. ఈ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను నీళ్ల మంత్రి హరీశ్‌రావుతోపాటు జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి, ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల వద్ద నిద్రలు చేసి పనులను పరుగెత్తించిండ్రు. అందుకే ఈరోజు 800 నుంచి వెయ్యి చెరువులు నింపుకుంటున్నము. 60 ఏళ్ల, కాంగ్రెస్‌–టీడీపీ పాలన పాలమూరుకు చేసిన ప్రయోజనమేంది? పాలమూరు అనగానే వలసలు, కరువులు, పెండింగ్‌ ప్రాజెక్టులు... ఇదీ వీళ్ల బతుకు. వీళ్లు ఇచ్చిన బహుమానం. 

జబర్దస్తీగా ఆంధ్రాలో కలిపారు... 
తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఎవరు నెహ్రూ కాదా? హైదరాబాద్‌ సిటీ కాలేజీలో జరిగిన ఫైరింగ్‌లో ఏడుగురు విద్యార్థులు చనిపోయారు. ఇడ్లీ, సాంబర్‌ గోబ్యాక్‌ అంటూ నినదించారు. ఇంత చేసినా జబర్దస్తీగా ఆంధ్రాలో కలిపారు. 1969లో మా తెలంగాణ మాకు కావాలంటే ఇందిరాగాంధీ ఏం చేసిందో తెలియదా? 2004లో సోనియా గాంధీ కూడా మర్యాదగా తెలంగాణ ఇచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండకపోయేది. వందల మందిని బలిదానం చేసుకునే పరిస్థితి కల్పించినది ఎవరు? టీఆర్‌ఎస్‌ కనుక 14 ఏళ్లు ఉద్యమాన్ని నిలబెట్టకపోయుంటే తెలంగాణ వచ్చేదా?  

ఛీఛీ... నీతో పొత్తా బాబు? 
చంద్రబాబు మాట్లాడుతడు... కేసీఆర్, నరేంద్ర మోదీ ఒక్కటైనరంటడు. మాకేం పనిరా బై? అర్థం కాక అడుగుతా. చంద్రబాబు అంటడు నన్ను వేధిస్తున్నరంటడు. నిన్ను ఎందుకు వేధిస్తరు బై.. నీవు సక్కనోడివి అయితే. ఓటుకు కోట్లు దొంగతనం చేసింది నీవు కాదా? నీవు పంపిన బుడ్డరఖాన్‌ పైసలు పంచుతూ పట్టుబడలేదా? ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా? నీ వాయిస్‌ రికార్డు లేదా? ఉన్నదా.. లేదా? తెలుగువాళ్లం ఒకటిగా ఉందామని చంద్రబాబు అంటడు. ఇలాంటి మాటలు చెప్పే కదా 60 ఏళ్లు దోచుకున్నది. ఇది నిజం కాదా? చంద్రబాబూ... నీతో పొత్తా. ఛీఛీ.. నీవు అడుగు పెడితే పచ్చని చెట్లు కూడా మాడిపోతయి. అంత దరిద్రం. ఐరన్‌ లెగ్‌ నీది. నీ సోపతి మాకెందుకు? మా సంసారం మేం చేసుకుంటము. మా బతుకు మేము బతుకుతున్నం. మహాకూటమా.. గూటమా దా. తేల్చుకుందాం. ఎన్నికల గోదాలో దిగాం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు. అంగన్‌వాడీ, హోంగార్డుల వంటి చిన్న ఉద్యోగులను ఆదరించాం. మిగతా ఉద్యోగులను కూడా ప్రభుత్వం రాగానే పిలిచి మీ గాయాలు సెటిల్‌ చేస్తాం. అంతేకాదు తెలంగాణను దాచిదాచి దయ్యాల పాలు చేయవద్దు. దుర్మార్గులకు అప్పగించి తెలంగాణ నాశనం చేయవద్దు అని మనవిచేస్తున్నా. 

చాలా బాధగా ఉండేది: సురేశ్‌రెడ్డి 
ఉమ్మడి రాష్ట్ర శాసనసభాపతిగా ఉన్న సందర్భంగా సభలో పాలమూరు కరువు గురించి చర్చకు వచ్చినప్పుడు చాలా బాధగా ఉండేదని మాజీ స్పీకర్‌ కె. ఆర్‌. సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాంతం పేదరికంలో ఆరో స్థానంలో, నీటి ఎద్దడిలో మూడో స్థానంలో, వలసల్లో నాలుగో స్థానంలో ఉన్నట్లు నివేదికలు వచ్చినప్పుడు ఎంతగానో ఆవేదన చెందినట్లు తెలిపారు. కానీ ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూస్తే చాలా గర్వంగా ఉందన్నారు. ఈరోజు సంక్షేమం, అభివృద్ధి రెండు అంశాల్లో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అభివృద్ధిని చూసి విపక్షాలు ఓర్వలేక మహాకూటమి పేరుతో మహాకుట్ర చేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ సమాజం ప్రస్తుతం కీలక స్థానంలో ఉందని.. ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

తప్పుంటే డిపాజిట్లు పోగొట్టండి.. 
మేము చెప్పే విషయంలో తప్పు ఉంటే పాలమూరులోని 14 సీట్లలో డిపాజిట్లు రాకుండా ఓడగొట్టండి. నిజమైతే 14 సీట్లలో గులాబీ జెండా ఎగురవేయండి. నేను మస్తు కొట్లాడిన. ఇక ముందు కొట్లాడుత. చైతన్యవంతమైన ప్రజలు ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ కావాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి కావాలె. జూరాల, ఆర్డీఎస్, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకోలేదు. ఈరోజు 7 లక్షల ఎకరాలకు నీరు పారుతున్నయి. ఈరోజు రూ. 9 వేల కోట్లు ఖర్చు చేసి పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినము. ర్యాలంపాడు, తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసుకున్నం. ఆర్డీఎస్‌లో 87 వేల పాత ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. కల్వకుర్తిలో 40 రిజర్వాయర్లు నిర్మించాల్సినవి ఉన్నాయి. త్వరలో మన ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలు చేపట్టుకుందాం. తెలంగాణ తేకపోతే 2001లో రాళ్లతో కొట్టి చంపమని చెప్పాము. పాలమూరులో మరో 12 లక్షల ఎకరాలకే కాకుండా నారాయణపేట, కొడంగల్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌నగర్‌ ప్రాంతాలకు సాగునీరు అందించి తీరుతం. ఒక్క పాలమూరులో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పచ్చబడేలా చేస్తం. మిషన్‌ భగీరథను కూడా పూర్తి చేసి తీరుతాం. పాలమూరు 5.5 లక్షల కనెక్షన్లు పూర్తి చేశాం. త్వరలో మిగిలిపోయిన మరో 1.5 లక్షల కనెక్షన్లను పూర్తి చేస్తాం. వనపర్తి సభలో శపథం చేస్తున్నా. 14 సీట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి తీరాలి.

నిరంతర ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
రైతాంగానికి 24 గంటలపాటు ఉచితంగా కరెంట్‌ సరఫరా చేసే రాష్ట్రం దేశంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఎరువులు దొరకకపోయేవి. విత్తనాల షాపుల వద్ద చెప్పులు ఉండేవి. పోలీసుల లాఠీచార్జీలు అయ్యేవి. ఈరోజు అలాంటి సమస్యలేవీ లేవు. నకిలీ విత్తన కంపెనీలను పట్టి జైళ్లలో వేస్తున్నం. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారిగా ఎకరానికి రూ. 8 వేలు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చింది కూడా తెలంగాణ రాష్ట్రమే. అంతేకాదు 5 గుంటల భూమి ఉన్న రైతుకు కూడా రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడదామా? 
ఆంధ్ర బాబు.. చంద్రబాబు.. పాలమూరును గతంలో 9 ఏళ్లు దత్తత తీసుకొని గుండెల మీద గుద్దిండు. శిలాఫలకాలు, పునాది రాళ్లు తప్ప చేసిందేమీ లేదు. వాళ్లు వేసిన పునాది రాళ్లను తీసుకుపోయి కృష్ణా నదిలో పడేస్తే ఒక డ్యామ్‌ తయారైతది. శిలాఫలకాలు తప్ప పనులు చేయలేదు. అలాంటి దుర్మార్గుడు. కాంగ్రెస్‌ నీచాతి నీచంగా దిగజారిపోయి చంద్రబాబు కాళ్ల దగ్గర పడుతోంది. మళ్లీ ఆంధ్రోళ్లకు ఇస్తమా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి విజయవాడలో తాకట్టు పెడదామా? నిర్ణయాలు హైదరాబాద్‌లో జరగాలనా లేక అమరావతి, ఢిల్లీలో జరగాలనా? ఈ పట్టు వీడితే గోసి ఊడిపోతది. ఆగమైపోతం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement